కార్డుదారులూ...తస్మాత్ జాగ్రత్త..!

12 Sep, 2016 20:15 IST|Sakshi

-ఓ పక్క క్లోనింగ్... మరోపక్క స్కిమ్మింగ్
-నిత్యం సైబర్ క్రై మ్ పోలీసులకు ఫిర్యాదులు
-నిత్యం మోసపోతున్నది కనీసం 15 మంది
-కనీస జాగ్రత్తలే మేలంటున్న అధికారులు
సాక్షి, సిటీబ్యూరో

 ప్లాస్టిక్ మనీగా పిలిచే క్రెడిట్/డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. జీతాలు తీసుకోవడం మొదలుకొని షాపింగ్ చేసే వరకు ఇప్పుడు ప్రతి చోటా ప్లాస్టిక్ కరెన్సీనే వాడుతుండటంతో జీవితంగా భాగంగా మారిపోయాయి. దీన్నే కొందరు ఆసరాగా చేసుకుని హైటెక్ మోసాలకు పాల్పడుతున్నారు. సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రై మ్ పోలీసులకు ప్రతి రోజూ 15 ఫిర్యాదులు వస్తున్నాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షాపింగ్ చేసేప్పుడు, రెస్టారెంట్లుకు వెళ్లేప్పుడు నోట్ల కట్టలతో తిరిగే బదులు అంతా వీటి వినియోగానికే మొగ్గుచూపున్నారు. ఇది ఈ కార్డులకు సంబంధించిన ఒక కోణం మాత్రమే. సాంకేతిక పరిఙ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్లాస్టిక్ కరెన్సీని దుర్వినియోగం చేయడం మరో కోణం. ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించి క్లోనింగ్, స్కిమ్మింగ్ ఉదంతాలు పెరిగిపోయాయి. అనేక వ్యవస్థీకత ముఠాలు రంగంలోకి దిగి విజంభిస్తున్నాయి. మరోపక్క బ్యాంకుల పేర్లతో ఫోన్లు చేసి కార్డు వివరాలు తెలుసుకుని అందినకాడికి దండుకుంటున్న ముఠాలు అనేకం ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కార్డుల వినియోగం, జరిగే మోసాలు, జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...

స్కిమ్మింగ్ ఏమిటి..?
ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా స్కిమ్మింగ్ పెరిగిపోయింది. ఈ ముఠాలు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ తదితర ప్రదేశాల్లో ఉండే బాయ్స్‌ను ప్రలోభాలకు లోను చేసిన తమ వైపు తిప్పుకుంటారు. వినియోగదారుడు అక్కడకు వెళ్లిన సందర్భంలో బిల్లు చెల్లించడానికి కార్డులు ఇచ్చినప్పుడు వాటిని స్కిమ్ చేస్తారు. దీనికోసం వాడే స్కిమ్మర్ అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటాయి. కార్డుని ఒక్కసారి అందులో స్వైప్ చేస్తే చాలు... దాని డేటా మొత్తం అందులో నిక్షిప్తమైపోతుంది. అంటే మన కార్డు గుట్టు వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. మరోపక్క ఏటీఎం సెంటర్లలో ఫిక్స్ చేసే స్కిమ్మర్లూ ఉన్నాయి. వీటిని ఏటీఎం మిషన్‌లో కార్డులను ఇన్‌సర్ట్ చేసే ప్రదేశంలో ఫిక్స్ చేస్తారు. డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లిన వినియోగదారుడు కార్డును ఇన్‌సర్ట్ చేయగానే... అక్కడ ఏర్పాటు చేసిన స్కిమ్మర్ డేటాను గ్రహిస్తుంది.

క్లోనింగ్..
ఈ విధానంలో వినియోగదారుడు తాను మోసపోయానని గుర్తించడానికీ చాలా కాలం పడుతుంది. క్లోనింగ్ చే సే ముఠాలకు కార్డులు అందుబాటులో ఉండాల్సిన పని లేదు. వీరికి ఇంటర్‌నెట్ ప్రధాన ఆధారం. బ్యాంకులకు సంబంధించిన వెబ్‌సైట్లు హ్యాక్ చేయడం, కొందరు బ్యాంకు సిబ్బందిని ప్రలోభ పెట్టడం ద్వారా అక్కడుండే కార్డు హోల్డర్ల డేటా సేకరిస్తారు. మరోపక్క ఆన్‌లైన్ షాపింగ్ అంటూ ఎరవేయడం ద్వారా... వినియోగదారుల వివరాలు వెరిఫికేషన్ చేస్తున్నామంటూ ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు పంపించి, పూర్తి సెక్యూర్డ్ కాని వెబ్‌సైట్స్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసే సందర్భంలోనూ కార్డు హోల్డర్ల డేటా తీసుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో పరిచయస్తుల కార్డులకు సంబంధించిన వివరాలను చోరీ చేస్తారు.

బోగస్ తయారీ ఇలా..
ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించిన డేటా ముష్కరుల చేతికి చేరిన తరవాత... స్కిమ్మింగ్, క్లోనింగ్ కార్డులను తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కంప్యూటర్, కార్డు రైటర్, కార్డు మేకర్, మేగ్నెటిక్ స్ట్రిప్, ఎమ్టీ కార్డులు... ఇవన్నీ ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకుని బోగస్ కార్డుల తయారీని ‘కుటీర పరిశ్రమలా’ స్థాపించేస్తున్నారు. కంప్యూటర్‌ను వినియోగించి తాము సేకరించిన డేటాను కార్డు రైటర్ పంపిస్తారు. అక్కడ నుంచి ఎమ్టీ కార్డుల్లో మేగ్నెటిక్ స్ట్రిప్ ఏర్పాటు చేసి వాటిని రైటర్‌లో పెట్టడం ద్వారా డేటా మొత్తం ఫీడ్ చేస్తారు. కార్డు మేకర్‌లో ఉంచి సంబంధిత బ్యాంకు డిజైన్‌తో బోగస్ కార్డులు తయారవుతాయి. ఇవి అసలు కార్డులకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి. ఈ కార్డులతో ముష్కరులు షాపింగ్ చేసుకుంటే... బిల్లులు మాత్రం అసలు కార్డు హోల్డర్‌కు వచ్చి చేరతాయి.

కాస్త అప్రమత్తంగా ఉంటే...
- ఏక్కడైనా బిల్లు చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డులను ఇస్తే... వాటిపైనే దష్టి పెట్టి ఉంచండి.
- పూర్తిగా పరిచయస్తులు కాని వారికి క్రెడిట్ కార్డుల వివరాలు, పిన్ నెంబర్లు చెప్పకండి.
- కార్డును అందుకున్న వెంటనే దాని వెనుక వైపు తప్పకుండా సంతకం చేయాలి.
- కార్డు వెనుక ఉండే సీసీవీ కోడ్‌లోని చివరి మూడు అంకెలూ భద్రమైన చోట రాసిపెట్టుకుని, కార్డుపై లేకుండా తుడిచేయండి.
- సెక్యూర్డ్ కాని వెబ్‌సైట్స్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేయవద్దు.
- అవసరమైన క్రెడిట్ కార్డులు మాత్రమే మీతో ఉంచుకోండి.
- ఏటీఎం సెంటర్లకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి.
- కార్డుపైన, దాని కవర్ పైన ఎట్టిపరిస్థితిల్లోనూ పిన్ నెంబర్ రాయద్దు.
- కార్డు పోయినట్లయితే వెంటనే సంబంధిత బ్యాంక్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి బ్లాక్ చేయించండి.
- అపరిచితులు కాల్ సెంటర్ల నుంచి అంటూ ఫోన్ చేస్తే గుడ్డిగా నమ్మి కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పవద్దు.
- దుకాణదారులు సైతం సంతకాలు లేని కార్డులను అనుమతించకూడదు.
- పెద్ద ఎత్తున ట్రాన్స్‌క్షన్స్ జరిగిన సందర్భంలో వినియోగదారులు గుర్తింపు పత్రాలు అడిగి, వాటిని సరిచూసుకోవాలి.
- క్రెడిట్ కార్డు రిసిప్ట్‌లను ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా పడేయకూడదు.
- ప్రతి నెలా మీరు చేస్తున్న లావాదేవీల బిల్లులు జాగ్రత్త చేసుకుని, కార్డు స్టేట్‌మెంట్ వచ్చిన తరవాత సరిచూసుకోండి.
- మీ కార్డు లావాదేవీలపై ఎలాంటి సందేహాలు వచ్చినా... వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించండి.

మరిన్ని వార్తలు