సహజీవనం పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు

9 Oct, 2015 21:41 IST|Sakshi
సహజీవనం పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు

హైదరాబాద్: ఉద్యోగంతో పాటు వ్యాపారంలో వాటా ఇస్తానని మాయమాటలతో నమ్మబలికి సహజీవనం చేసి మోసానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఏడుగురిపై కోర్టు ద్వారా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు.. 25వ మెట్రోపాలిటన్ కోర్టు ద్వారా ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సీఐ నర్సింహులు వివరించారు.

నిజాంపేటలో నివాసముండే సంకు రమణ(33) హబ్సిగూడలోని ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ రియల్‌ఎస్టేట్ కార్యాలయంలో ఏజీఎంగా పని చేస్తున్నాడు. నింబోలి అడ్డలో నివాసం ఉండే ఓ వివాహిత(27) ఫార్చూన్ బటర్ ఫ్లై సిటీ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరింది. 2014 నుంచి మాదాపూర్‌లోని అయ్యప్ప సోసైటీలో మరో బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మార్కెటింగ్ మేనేజర్‌ను ఆ రోజు నుంచి అక్కడే విధులు నిర్వహించాలని రమణ చెప్పాడు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రమణ కార్యాలయంలోనే ఉండేవాడు. కారులో తీసుకెళ్తూ వివాహితతో అన్యోన్యంగా మెలిగాడు. జీతంతో పాటు చేసే వ్యాపారంలో 50 శాతం వాటా ఇస్తానని, రూ. 25 లక్షలు డిపాజిట్ చేస్తానని, ఐదేళ్ల కొడుకును డిగ్రీ వరకు తానే చదివిస్తానని నమ్మబలికాడు. మహరాణిలా చూసుకుంటానని, భర్తకు విడాకులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు.

కార్యాలయానికి సమీపంలోనే అయ్యప్ప సొసైటీలో మరో ఫ్లాట్ అద్దెకు తీసుకొని మార్కెటింగ్ మేనేజర్‌ను అక్కడే ఉంచాడు. వీకెండ్‌లో ఆమె ఫ్లాట్‌లోనే రాత్రి వేళల్లో ఉంటూ సహజీవనం చేస్తూ, రిసార్ట్స్‌లలో తిప్పాడు. ఆమె గర్భం దాల్చడంతో మత్తు ఇచ్చి గర్భస్రావం అయ్యేటట్లు చేశాడు. బలవంతంగా మద్యం తాగించేవాడు. భార్య జానకీ పాటు సహ ఉద్యోగులు కిరణ్, రాజేష్, వాసు, రవి, మధు, రాములు సహజీవనం విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. జీతంతోపాటు కమిషన్ రూ.5 లక్షలు రావాల్సి ఉంది. ఈలోగా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఫ్లాట్ అద్దె గడువు ముగియడంతో యజమాని ఖాళీ చేయాలని బాధితురాలితో చెప్పాడు. దీంతో ఆమె రమణను ఫోన్‌లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. సెప్టెంబర్ 26న మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా వినాయక నిమజ్జనంలో పోలీసులు ఉండటంతో ఆమె కోర్టును ఆశ్రయించింది.

సంకు రమణతో పాటు అతనికి సహకరించిన కూకట్‌పల్లికి చెందిన కిరణ్(40), రాజేష్(32), వాసు(32), రవి(33)లతో పాటు ప్రధాన నిందితుడి భార్య జానకి అలియాస్ ధనలక్ష్మి(29), మధు(30), రాము(29)లపై కోర్టు ద్వారా ఐపీసీ 420, 313, 376, 506, రెడ్‌విత్-34 సెక్షన్‌ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు. బాధితురాలు శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు విచ్చేశారు. మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. ఆమె నుంచి సీఐ వివరాలు సేకరించి గచ్చిబౌలిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. సీఐ సునీత బాధితురాలి నుంచి మరిన్ని వివరాలను సేకరించారు. దాదాపు ఏడాదిపాటు సహజీవనం చేసి మోసగించినట్లు ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు