చెత్త వేశారో.. తిక్క కుదురుస్తారు

3 May, 2017 00:19 IST|Sakshi
చెత్త వేశారో.. తిక్క కుదురుస్తారు

సీసీ కెమెరాలతో గుర్తిస్తారు 
పెనాల్టీలు.. కఠిన చర్యలు


సిటీబ్యూరో: మీకు తెలిసో .. తెలియకో ఖాళీ ప్రదేశం ఉందని రోడ్లపై చెత్త వేశారో కెమెరా కళ్లు గుర్తిస్తాయ్‌. చెత్త వేసిన వారికి పెనాల్టీలు విధిస్తారు. పదే పదే అదే ‘చెత్త’పని చేస్తే జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు ఇతర కఠిన చర్యలు తీసుకుంటారు. గడిచిన ఏడాది కాలంగా స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ బహిరంగ ప్రదేశాల్లో కుప్పలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించింది. ఇలాంటి 1,116 ప్రదేశాల్లో గుట్టలుగా పోగైన చెత్తను తొలగించడంతో పాటు ఆయా సందర్భాల్లో అక్కడ ముగ్గులు వేశారు. దీపావళి వంటి పండుగలు నిర్వహించారు. ఖాళీ అయిన ఆ ప్రదేశాల్లో తిరిగి చెత్త వేస్తుండటం అధికారుల దృష్టికి వచ్చింది. ఎన్ని విధాలుగా చెప్పినా, ఎంతగా అవగాహన కల్పించినా మారని వారికోసం కఠిన చర్యలు తప్పవనే నిర్ణయానికొచ్చారు. అందులో భాగంగా చెత్త తొలగించిన 1,116 ప్రాంతాల (ఓపెన్‌ గార్బేజ్‌) వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా సిటీ పోలీస్‌ కమిషనర్‌ను కోరనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా పోలీసు విభాగం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఓపెన్‌ గార్బెజ్‌ పాయింట్ల వద్ద వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ, ఆ ప్రాంతాల జాబితాతో కూడిన లేఖ పంపనున్నట్లు పేర్కొన్నారు. మలిదశలో  ఇతర బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిని గుర్తించేందుకు కూడా సీసీ కెమెరాలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో చెత్త వేస్తున్నవారిని గుర్తించి, ఒకటి రెండు పర్యాయాలు హెచ్చరిస్తారు. అప్పటికీ వినకపోతే జరిమానాలు, కఠిన చర్యలు తీసుకుంటారు.  

విధులకు రాని స్వచ్ఛ ఆటో డ్రైవర్ల తొలగింపు..
జీహెచ్‌ఎంసీ దాదాపు రూ.200 కోట్లతో 2000 స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేసి, చెత్త తరలించే వారికి వాటిని ఉచితంగా అందజేసింది. వారిలో దాదాపు 500 ఆటోల డ్రైవర్లు తాము పని చేయాల్సిన ప్రాంతంలో విధులు నిర్వర్తించడం లేదు. వరుసగా పదిరోజులు విధులకు గైర్హాజరయ్యేవారిని గుర్తించి నోటీసులు జారీ చేసి, వారిని విధుల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం పారిశుధ్యం, రవాణా అంశాలపై సంబంధిత అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో దృష్టికొచ్చిన అంశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా(ఓడీఎఫ్‌) తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమం ఫలితాలివ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం కూడా ఆశించినంత వేగంగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ఫలితం స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాల్లో ప్రతిబింబించే అవకాశం ఉందన్నారు.

కార్మికుల సంక్షేమానికి పెద్దపీట..
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషించే పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్మికులందరికీ బీమా సదుపాయం కల్పించడంతోపాటు వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బయోమెట్రిక్‌ హాజరును పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు