-

‘నగదు రహితం’ అనివార్యం!

14 Dec, 2016 02:53 IST|Sakshi
‘నగదు రహితం’ అనివార్యం!

- అవగాహనా సదస్సులో ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ వందనా గాంధీ
- రద్దయిన కరెన్సీ విలువలో మొత్తం కొత్త కరెన్సీ 30 శాతమేనని వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: ‘నోట్ల రద్దు’ పరిణామాల నేపథ్యంలో సాధారణ ప్రజలు నగదు రహిత లావా దేవీల వైపు మరలడం అనివార్యమవుతోందని.. ఈ దిశగా ప్రజానీకాన్ని ప్రోత్సహించాలని ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ వందనా గాంధీ పేర్కొన్నారు. రద్దు చేసిన నోట్లలో రూ.14 లక్షల కోట్లు ఇప్పటికే బ్యాంకుల్లోకి వచ్చాయన్నారు. అయితే రద్దయిన నోట్లలో 90 శాతం బ్యాంకులకు చేరినా.. వాటి స్థానంలో 30 శాతం మాత్రమే కొత్త కరెన్సీ సరఫరా కానుందని చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలకు వెళ్లక తప్ప దని సూచించారు. ‘నగదు రహిత లావాదేవీల’పై ప్రచా రంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళవారం సచివా లయంలో విలేకరులకు ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించింది. ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్‌ల అధికారులు ఈ సదస్సులో పాల్గొని తమ సంస్థల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మొబైల్‌ యాప్‌లు, నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాలు, మొబైల్‌ వ్యాలెట్,  ప్రీపెయిడ్‌  కార్డులు, డెబిట్‌ కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వందనా గాంధీ మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలపై ఈ నెల 31 వరకు ఎలాంటి చార్జీలూ ఉండవని చెప్పారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా నగదు రహిత లావాదేవీల నిర్వహణ కోసం స్టేట్‌ బ్యాంక్‌ పలు యాప్‌లను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు ఎంతో సురక్షితమని నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్‌ పట్ల భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా పన్నులు, బిల్లులు, మ్యూచువల్‌ ఫండ్స్, ఫీజులు చెల్లించవచ్చన్నారు. తమ స్టేట్‌ బ్యాంక్‌ ఫ్రీడం యాప్‌ ద్వారా ఖాతాలోని బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, ఈ–డిపాజిట్స్, బిల్లుల చెల్లింపులు, మొబైల్‌ టాపప్, డీటీహెచ్‌–రీచార్జీల వంటి సేవలు పొందవచ్చన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ బడ్డీ యాప్‌ ద్వారా కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు, మొబైల్‌ రీచార్జీతోపాటు వివిధ రకాల బిల్లులు, విమాన టికెట్లు, హోటల్స్‌ బుకింగ్, చెల్లింపులు, సినిమా, రైల్వే, బస్‌ టికెట్లు వంటివి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీహెచ్‌ చీఫ్‌ మేనేజర్‌ అనిరుధ్‌ అగ్నిహోత్రి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు