కేంద్ర వ్యవసాయ పథకాల్లో నగదు బదిలీ

6 Mar, 2017 00:55 IST|Sakshi
కేంద్ర వ్యవసాయ పథకాల్లో నగదు బదిలీ

రాష్ట్ర వ్యవసాయ శాఖలకు కేంద్రం ఆదేశాలు
⇒ నేడు ఢిల్లీలో రాష్ట్రాల వ్యవసాయ ఉన్నతాధికారులతో వర్క్‌షాప్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ద్వారా రాష్ట్రాల్లో అమలుచేసే 10 వ్యవసాయ పథకాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నగదు బదిలీ (డీబీటీ) విధానాన్ని అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. పంటల బీమా సొమ్ము రైతుకు చేరడంలో జాప్యమవుతుండటంతో పంట నష్టపోయిన రైతు పరిహారం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఎంఐడీహెచ్‌ పథకం ద్వారా ఉద్యాన రైతులకిచ్చే సూక్ష్మ సేద్యం సబ్సిడీ సొమ్ము పక్కదారి పడుతోందన్న విమర్శలూ ఉన్నా యి.

ఈ నేపథ్యంలో డీబీటీ అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. దీన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు డీబీటీ పోర్టల్‌ సిద్ధం చేసింది. దీని ద్వారా సబ్సిడీ సొమ్ము నేరుగా రైతుల ఖాతాలకే చేరుతుంది. అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్‌ సెంటర్స్‌ (ఏసీఏబీసీ) పథకం, వ్యవసాయ యాంత్రీకరణ, పీఎంకేఎస్‌వై, సమగ్ర ఉద్యానాభివృద్ధి సంస్థ (ఎంఐడీహెచ్‌), వ్యవసాయ విస్తరణలో సం స్కరణల పథకం, విత్తనాలు, మొక్కల మెటీరియల్‌ పథకం, రైతులకు పంట రుణాల వడ్డీ పథకం, పంటల బీమా పథకం, జాతీ య ఆహార భద్రత మిషన్, వ్యవసాయ సహకార సమగ్ర పథకాల్లో ఈ విధానాన్ని అమ లుచేస్తారు. లబ్ధిదారుల జాబితాను డీబీటీ పోర్టల్‌లో పొందుపరుస్తారు. దీనివల్ల పర్యవేక్షణ సులువుగా ఉంటుందనేది కేంద్రం ఆలోచన. ప్రతి పథకానికి ఒక యునిక్‌ కోడ్‌ నంబర్‌ ఇవ్వడంతో పాటు పథకాల పురోగతిని పోర్టల్‌లో ఉంచుతారు. డీబీటీ విధానం అమలుపై రాష్ట్రాలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం ఢిల్లీలో వర్క్‌షాప్‌ నిర్వహించనుంది.

రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధం...
కేంద్రం ద్వారా అమలు చేసే పథకాలతోపాటు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అమలుచేసే పథకాల్లోనూ డీబీటీని అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. విత్తనాలు, వ్యవసాయ యంత్రాలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఇక నుంచి రైతు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ నుంచి నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ అమలు చేస్తారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. వరి, సోయాబీన్, శనగ, వేరుశనగ, పచ్చిరొట్ట తదితర విత్తనాలను రైతులకు 33 శాతం సబ్సిడీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ సరఫరా చేస్తోంది. ఈ బాధ్యతలను కొన్ని సంస్థలకు అప్పగించి, దీనికి ఇచ్చే సబ్సిడీని రైతు ఖాతాలో జమచేస్తారు. వ్యవసాయ యంత్రాల సబ్సిడీ కూడా రైతు ఖాతాలో జమ చేస్తారు.

మరిన్ని వార్తలు