6 ఏరియా ఆస్పత్రుల్లో కేటరాక్ట్ ఆపరేషన్లు

22 Sep, 2016 19:48 IST|Sakshi

హైదరాబాద్: ఇప్పటివరకూ ఏపీలోని జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో మాత్రమే కంటి శుక్లాలు (కేటరాక్ట్) ఆపరేషన్లు జరిగేవి. కానీ చాలామంది గ్రామీణ ప్రాంతాలవాసులు పట్టణాలకు వచ్చి ఇబ్బందులుపడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఆరోగ్యమిషన్ నిధులతో ఏపీలోని వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఆరు ఏరియా ఆస్పత్రుల్లో కేటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కేటరాక్ట్ జరుగుతున్నట్టు వైద్య విధానపరిషత్ వర్గాలు తెలిపాయి.

పులివెందుల, నరసరావుపేట, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సీపట్నం, టెక్కలి ఏరియా ఆస్పత్రుల్లో శుక్లాల ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో 115 విజన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో ప్రాథమిక పరీక్షలు జరుగుతాయి. కేటరాక్ట్ ఆపరేషన్లు అవసరమైతే పైన పేర్కొన్న ఏరియా ఆస్పత్రులకు గానీ, జిల్లా ఆస్పత్రులకు గానీ పంపిస్తారు.

కేటరాక్ట్ మినహా క్లిష్టమైన ఆపరేషన్లు అంటే నీటికాసుల జబ్బు (గ్లకోమా), డయాబెటిక్ రెటినోపతి వంటి వాటికి జిల్లా ఆస్పత్రుల్లో గానీ, బోధనాసుపత్రులకు గానీ పంపిస్తారు. త్వరలోనే మరో 20 ఏరియా ఆస్పత్రుల్లో కేటరాక్ట్ ఆపరేషన్లు జరగడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్యవిధానపరిషత్ అధికారులు తెలిపారు. గతంలో నెలకు 1200 కేటరాక్ట్ ఆపరేషన్లు జరుగుతుండగా, ఏరియా ఆస్పత్రుల్లో ఈ వసతి కల్పించాక ఈ సంఖ్య 2 వేలకు పెరిగిందని తెలిపారు.

మరిన్ని వార్తలు