పోస్టాఫీసులపై సీబీఐ ఆకస్మిక దాడులు

12 Dec, 2016 15:10 IST|Sakshi
పోస్టాఫీసులపై సీబీఐ ఆకస్మిక దాడులు
హిమాయత్‌నగర్‌లో రూ.40 లక్షలు అధీనంలోకి
 కొన్ని సేవింగ్‌‌స ఖాతాలు, ఫిక్సిడ్ డిపాజిట్లపై కన్ను
 ఈ నెల 8 నుంచి జరిగిన లావాదేవీల పరిశీలన
 బ్లాక్ మనీ మార్పిడి జరిగినట్లు అనుమానాలు
 
 సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల మార్పిడి నేపథ్యంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్‌లోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరవ్యాప్తంగా దాదాపు ఆరు చోట్ల ఏకకాలంలో ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. హిమాయత్‌నగర్ పోస్టాఫీస్‌లో ఉన్న రూ.40 లక్షల్ని తమ అధీనంలోకి తీసుకున్న సీబీఐ అధికారులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. పోస్టాఫీసులపై దాడుల నేపథ్యంలో పోలీసుల సహకారం సైతం తీసుకున్న సీబీఐ అధికారులు కార్యాలయాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.  తనిఖీల్లో పోస్టల్ విజిలెన్‌‌స అధికారులు సైతం పాల్గొన్నారని సమాచారం.
 
 ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు
 ఈ నెల 8న నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనూ పాత నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. దీంతో నగరవాసులు రూ.కోట్లలో పాత కరెన్సీని మార్పిడి చేసుకున్నారు. అరుుతే ప్రతి మార్పిడితోనూ కొన్ని ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలనే నిబంధన ఉంది. కొన్ని పోస్టాఫీసులకు చెందిన అధికారులు సిబ్బంది దీన్ని అతిక్రమించారని, కొందరికి ‘వెసులుబాటు’ కల్పిస్తూ పాత నోట్ల మార్పిడికి సహకరించారని సీబీఐకి వరుస ఫిర్యాదులు అందాయి. వీటికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సైతం సేకరించిన అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గురువారం ఏకకాలంలో దాడులు చేశారు. పోస్టాఫీసులకు సంబంధించి నోట్ల మార్పిడితో అవకతవకలతో పాటు డిపాజిట్లు, సేవింగ్‌‌స ఖాతాల్లో జమల్లోనూ భారీ అవకతవకలు జరిగినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రికార్డుల్ని పూర్తి స్థాయిలో పరిశీలించడంతో పాటు ఈ నెల 10 తర్వాత జరిగిన అన్ని ఫిక్సిడ్ డిపాజిట్లు, సేవింగ్‌‌స ఖాతాల్లో జమలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
 
 అవకతవకలు నిర్ధారణ కాలేదు
 పోస్టాఫీసుల్లో సీబీఐ తనిఖీలు సాధారణమని, తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు నిర్ధారణ కాలేదని పోస్టాఫీసు హైదరాబాద్ సిటీ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ కె.సుధీర్‌బాబు తెలిపారు. సీబీఐ బృందం సాధారణ ప్రక్రియలో భాగంగానే తనిఖీలు నిర్వహించి కరెన్సీ మార్పిడి విధానాన్ని పరిశీలించిందని, కరెన్సీ మార్పిడిలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు బహిర్గతం కాలేదని పేర్కొన్నారు.
 
 అనుమానిత పార్సిల్స్‌పైనా దృష్టి
 కొందరు ‘నల్లబాబులు’ పోస్టాఫీసుల్నే ఆధారంగా చేసుకుని అధికారులు, సిబ్బంది సహకారంతో అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అనుమానిస్తోంది. సరైన ధ్రువీకరణ లేకుండానే, ఒకే ధ్రువీకరణపై పలు లావాదేవీలు అనుమతిస్తూ పాత నోట్లను మార్చుకునే అవకాశం ఇచ్చారన్నది సీబీఐ అనుమానం. ఇలా సాధ్యం కాని సందర్భాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఫిక్సిడ్ డిపాజిట్లు చేయించుకుని, కొన్ని రోజులకే వాటిని రద్దు చేయిస్తూ కొత్త నోట్లు ఇచ్చినట్లు అనుమానాలను వ్యక్తం చేస్తోంది. కొన్ని అనుమానాస్పద పార్శిల్స్ పైనా దృిష్టిపెట్టినట్లు సమాచారం. ఈ నెల 8 తర్వాత నగరంలోని వాణిజ్య ప్రాంతాల నుంచి ఉత్తరాదితో పాటు ఇతర చోట్లకు వెళ్లిన కొన్ని పార్శిల్స్ వ్యవహారాలను సీబీఐ ఆరా తీసినట్లు తెలిసింది.
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు