సీసీ కెమెరాలతో సూపర్ సేఫ్టీ

3 May, 2016 01:26 IST|Sakshi
సీసీ కెమెరాలతో సూపర్ సేఫ్టీ

ప్రజాప్రతినిధులు, గేటెడ్ కమ్యూనిటీలు సహకరించాలి
అందరి సహకారంతో నేరాల నియంత్రణ
సీసీటీవీ కెమెరాలపై అవగాహన కార్యక్రమం
హోంమంత్రి నాయిని

 
 
కేపీహెచ్‌బీ: దొంగల అడ్రస్ గల్లంతు చేసేందుకు పోలీసులకు ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పిలుపునిచ్చారు. ఆధునీకరించిన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ను నాయిని సోమవారం ప్రారంభించారు.  అనంతరం జేఎ న్టీయూ ఆడిటోరియంలో సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కమ్యూనిటీ సీసీటీవీ అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోలీసు లు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడరని,  ప్రజల ఇళ్లనే దోచుకుంటారనే వాదనలున్నాయని, చోరీ ల నియంత్రణ కోసం కమ్యూనిటీ సీసీటీవీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ప్రజాప్రతి నిధులు, గేటెడ్ కమ్యూనిటీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల విషయంలో జంట పోలీసు కమిషనరేట్లు తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, దీనిపై ప్రధాని మోదీ కూడా కితాబునిచ్చారన్నారు.

ఒకప్పుడు ఠాణాకు వెళ్లాలంటే ఫిర్యాదుదారుడు ఒకటికి.. వందసార్లు ఆలోచించేవాడని, ఇప్పుడు పోలీసు స్టేషన్లు ఆధునీకరించి ప్రశాంత వాతావరణం నెలకొనడంతో బాధితులు ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

 సీసీటీవీలతో సేఫెస్ట్ సిటీ...
శాంతిభద్రతల కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రజల్లో మనోధైర్యాన్ని పెంచిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సీసీటీవీల ఏర్పాటుతో హైదరాబాద్ సేఫెస్ట్ సిటీగా మారుతుందన్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే అరెకాపూడిగాంధీ తమ నిధుల నుంచి రూ. కోటికిపైగా సీసీటీవీల కోసం ఇచ్చారన్నారు. కార్డన్‌సెర్చ్, మహిళల భద్రత, యాంటీ చైన్‌స్నాచింగ్ వంటి ఫోర్స్‌లు పటిష్టంగా పని చేయడం వల్ల గతేడాది కంటే ఈ నాలుగు నెలల్లోనే సైబరాబాద్‌లో 32 శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు.

 మరో రెండున్నర కోట్లు ఇస్తా:
 రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల కోసం తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.  నాలుగు నెలల్లో సీసీటీవీ కెమెరాల కోసం మరో రెండున్నర కోట్ల రూపాయలు అందిస్తానన్నారు.  తన నియోజకవర్గం పరిధిలో ఉన్న వందలాది సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులున్నారని, వీరిలో పనిచేసే విదేశీమహిళలు సైతం ఉన్నారని ఎమ్మెల్యే అరెకాపూడిగాంధీ అన్నారు.  షీ టీమ్స్‌తో మహిళల కు భద్రత పెరిగిందన్నారు. అంతకుముందు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో వెలుగులోకి వచ్చిన సంచలనాత్మక అంశాలతో పాటు వాటివల్ల కలిగిన ఉపయోగాలను డాక్యుమెంటరీ రూపంలో పోలీసులు వివరించారు.  కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ కార్తీకేయ, బాలానగర్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు, బాలానగర్ ఏసీపీ నంద్యాల నర్సింహ్మారెడ్డి, జోనల్ కమిషనర్ గంగాధర్ రెడ్డి, డీసీలు నరేందర్‌గౌడ్, రవీందర్‌కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు