స్కాలర్‌షిప్‌లు కాజేయబోయి కటకటాలపాలు

5 Mar, 2017 03:37 IST|Sakshi

ఇద్దరు ట్రెజరీ ఉద్యోగులను అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల ఉపకారవేతనాలను పక్కదారి పట్టించి కాజేయబోయిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కటకటాలపాలయ్యారు. ఈ మేరకు వారిని హైదరాబాద్‌ నగర సీసీఎస్‌ పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి వెల్లడించారు. హైదరాబాద్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ విభాగం సీనియర్‌ అసిస్టెంట్‌ అజయ్‌ కుమార్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ సబ్‌ ట్రెజరీ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ బాలూ నాయక్‌ మరికొందరితో కలసి ఉపకారవేతనాలను నొక్కేయాలని పథక రచన చేశారు. వివిధ కళాశాలల్లో ఉపకారవేతనాలు అందని విద్యార్థుల వివరాలను సేకరించారు.

ఆ విద్యార్థులు తిరిగి దరఖాస్తు చేసినట్టు, వాటిని అధికారులు ఆమోదించినట్టు నివేదికలు తయారు చేశారు. దీనికి నల్లగొండ జిల్లా ట్రెజరీ కార్యాలయంలోని కొందరు సిబ్బంది సహకరించారు. ఈ నివేదికలను హైదరాబాద్‌లోని డీటీఏ సర్వర్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఆయా దరఖాస్తుదారులకు మంజూరైన రూ.71 లక్షలను కోదాడలోని సాయి వికాస్‌ డిగ్రీ కాలేజీ ఖాతాలోకి బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై అనుమానించిన ఉన్నతాధికారులు రూ.71 లక్షలను తిరిగి ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ ఉదంతంపై సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి అజయ్‌కుమార్‌ రెడ్డి, బాలూ నాయక్‌లను అరెస్టు చేశారు. మరికొంత మంది సిబ్బంది పాత్రపై విచారణ సాగుతోందని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు