టీవీ ఆర్టిస్ట్ విజయరాణిపై కేసు నమోదు

14 Mar, 2014 14:44 IST|Sakshi
టీవీ ఆర్టిస్ట్ విజయరాణిపై కేసు నమోదు

హైదరాబాద్ : చిట్టీల పేరుతో జూనియర్ ఆర్టిస్టులను రూ.10 కోట్ల మేర నిండా ముంచిన నటి బత్తుల విజయరాణిపై సీసీఎస్లో కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా సీసీఎస్ డీసీపీ పాలరాజు మాట్లాడుతూ విజయరాణి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసినట్లు 120మంది బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపారు. రెండు దర్యాప్తు బృందాలతో విచారణ కొసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

కాగా  కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన బత్తుల విజయరాణి (46) టీవీ సీరియల్స్‌లో నటిస్తూ అమీర్‌పేట న్యూ శాస్త్రినగర్‌లో నివాసముంటోంది. 12 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం కూడా నడుపుతోంది. రూ. 5లక్షల నుంచి రూ. 50 లక్షల విలువైన చిట్టీల్లో సుమారు 400 మంది నటులు సభ్యులుగా చేరారు. గత నాలుగైదు నెలలుగా చిట్టీలు పాడిన వారికి ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో వారు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు.

రేపు మాపు అంటూ విజయరాణి వాయిదా వేస్తూ వస్తోంది. ఇది తెలిసి ఆమెకు లక్షల రూపాయల్లో బదులు ఇచ్చిన మరికొందరు కూడా తమ డబ్బులు తిరిగిచ్చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో విజయరాణి ఉన్నట్లుండి బుధవారం నుంచీ కనిపించకుండా పోయింది. దీనిపై బాధితులు జూనియర్ ఆర్టిస్టుల సంఘాన్ని ఆశ్రయించగా.. వారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో వారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీ జి.పాలరాజును ఆశ్రయించారు. ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు