ఓన్లీ సెల్‌ఫోన్స్..!

30 May, 2016 19:43 IST|Sakshi

హైదరాబాద్: కేవలం సెల్‌ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్‌టాప్స్‌ను తస్కరిస్తున్న దొంగను చిక్కడపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.1.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండల రమేష్ హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. వ్యసనాలకుబానిసైన అతడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సెల్‌ఫోన్ల దొంగగా మారాడు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో కార్మికుడిగా పని చేస్తున్న రమేష్... అర్ధరాత్రి వేళల్లో రెసిడెన్షియల్ ఏరియాల్లో సంచరిస్తూ రెక్కీ చేస్తాడు.

గాలి కోసమో, మరో కారణంతోనే తలుపులు, కిటికీలు తెరిచి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. తెల్లవారుజామున వాటిలోకి ప్రవేశించి కేవలం సెల్‌ఫోన్లు మాత్రమే తస్కరిస్తాడు. అవి దొరక్కపోతే మాత్రమే ట్యాబ్స్, ల్యాప్‌టాప్స్ ‘జోలికి వెళ్తాడు’. ఈ పంథాలో నేరాలు చేస్తూ 2014 మేలో గోపాలపురం పోలీసులకు చిక్కాడు. బయటకు వచ్చినా మళ్లీ చోరీలు మొదలుపెట్టి చిక్కడపల్లి, గోపాలపురం, నారాయణగూడ ఠాణాల పరిధిలో చోరీలు చేశాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు అతనిని అరెస్టు చేసి 20 ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు