కేంద్రమే పోలవరం ప్రాజెక్టును అప్పగించింది

16 Sep, 2016 02:50 IST|Sakshi
కేంద్రమే పోలవరం ప్రాజెక్టును అప్పగించింది

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయిస్తే త్వరగా పూర్తవుతాయని కేంద్రం తమకు అప్పగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీనిని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. తాత్కాలిక సచివాలయంలో గురువారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పనులు చేయించమంటే... నేనేదో కాంట్రాక్టర్‌ను నిర్ణయించానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారని ఆక్షేపించారు. దేశంలోనే మొదటిసారిగా అధునాతనమైన యంత్రాల ద్వారా పనులు మొదలు పెట్టినట్లు చెప్పారు. కిలోమీటరు వెడల్పున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 50 లక్షల క్యూసెక్కుల జలాలు వదులుతామని తెలిపారు.ప్రతి సోమవారం ‘పోలవారం’గా మారుతుందని, పనులు పర్యవేక్షించేందుకు తాను ప్రతి సోమవారం వెళతానని ఆయన తెలిపారు.
 
ఏమి లాభమో చెప్పండి?
ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయనే ప్రచారంలో నిజం లేదని చంద్రబాబు చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక రాయితీల కారణంగా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పటం వట్టి గాలి మాటలన్నారు. హోదావల్ల ఏమి లాభమో చెప్పండి? అని ప్రశ్నిం చారు. 2015-16 సంవత్సరానికి దేశంలో ఆర్‌బీఐ 954 బిలియన్ రూపాయల పెట్టుబడులు పెడితే అందులో ఆంధ్రప్రదేశ్‌కు 15.8 శాతం పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దసరాకు తాత్కాలిక సచివాలయంలో తన కార్యాలయం ప్రారంభిస్తానని సీఎం తెలిపారు. డిసెంబరు నాటికి అసెంబ్లీ, శాసన మండలి భవనాలు పూర్తి చేయాలని నిర్ణయించారు.
 
‘సాక్షి’పై విమర్శలు..: సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం తాత్కాలిక సచివాలయంలో విలేకరులతో మాట్లాడు తూ  సాక్షి కథనంపై అక్కసు వెళ్లగక్కారు. ‘నేను అవినీతి పరుడినంట. రూ.52 వేల కోట్లు స్విస్‌చాలెంజ్‌లో తిన్నానంట. తప్పుడు రాతలు రాస్తున్నారు’ అంటూ విమర్శించారు.
 
వెసులుబాటు కోసమే ప్యాకేజీ: సీఎం
సాక్షి,విజయవాడ: ప్రత్యేక హోదాకు సమానమైన స్థాయిలో నిధులిస్తామని కేంద్రం చెప్పడంతో.. రాష్ట్రానికి వెసులుబాటు కలుగుతుందన్న భావనతో ప్యాకేజీకి అంగీకరించానని  చంద్రబాబు చెప్పారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ), ఆయన కుమారుడు అవినాష్, కాంగ్రెస్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కడియాలు బుచ్చిబాబులు గురువారం విజయవాడ గుణదల బిషప్ గ్రాసీ స్కూల్ ఆవరణలో నిర్వహించిన సభలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు.

మరిన్ని వార్తలు