ప్రాజెక్టులపై పెత్తనం బోర్డుకే!

21 Apr, 2018 01:12 IST|Sakshi

బోర్డు మ్యాన్యువల్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలత

ఇరు రాష్ట్రాల వివరణలు తెలుసుకున్నాకే తుది నిర్ణయం

కేంద్ర జల వనరుల శాఖ జాయింట్‌ సెక్రెటరీతో బోర్డు చైర్మన్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులపై పెత్తనాన్ని పూర్తిగా బోర్డుకే కట్టబెట్టేలా కేంద్ర జల వనరుల శాఖ మంత్రాంగం నడుపు తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులంతా తమ అధీనంలోనే పనిచేసేలా కృష్ణా బోర్డు రూపొందించిన తుది వర్కింగ్‌ మ్యాన్యువల్‌ను ఆమోదించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది.

రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నివారణకు ఇది ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం కేంద్ర జల వనరుల శాఖ జాయింట్‌ సెక్రెటరీ సంజయ్‌ కుందూతో ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో భేటీ అయిన బోర్డు చైర్మన్‌ వైకే శర్మ బోర్డు పరిధి, వర్కింగ్‌ మ్యాన్యువల్‌పై చర్చించారు. బోర్డుకు ఎలాంటి అధికారాలివ్వకుండా రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించమంటే సాధ్యమయ్యేది కాదని శర్మ స్పష్టం చేసినట్లు తెలిసింది.

తమ నిర్ణయాన్ని ఇరు రాష్ట్రాలకు తెలియజేసి, వారి వివరణలు తెలుసుకున్నాకే, బోర్డుకు సర్వాధికారాలు అప్పజెప్పే అంశంపై నిర్ణయం తీసుకుంటామని సంజయ్‌ తెలిపినట్లు సమాచారం. బోర్డుకే అధికారాలిస్తే అవసరమయ్యే సిబ్బంది, నిర్వహణ వ్యయం, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

మార్గదర్శకాలివీ..  
♦  బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల విషయం లో ఏ పనులు చేయాలన్నా అనుమతి తప్పనిసరి. వాటి అంచనాలను బోర్డుకు అందించాల్సి ఉంటుంది.
♦ కృష్ణా బేసిన్‌లో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఇరు రాష్ట్రాలు పూర్తి చేసుకోవచ్చు.
♦  కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు తేల్చే వరకూ కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఒప్పందం అమల్లో ఉంటుంది.
 తెలంగాణ, ఏపీ పరిధిలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఉద్యోగులంతా తమ అధీనంలోనే పనిచేయాలి.
  మార్గదర్శకాలపై ఏపీ కొంత సానుకూలంగా ఉన్నా, తెలంగాణ వ్యతిరేకి స్తోంది. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేకుం డా నియంత్రణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది.

మరిన్ని వార్తలు