‘మ్యాచింగ్‌’ కాక.. నిధులు రాక..!

3 Jan, 2018 04:07 IST|Sakshi

     మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులివ్వని రాష్ట్ర ప్రభుత్వం 

     దీంతో నిధులను ఆపేసిన కేంద్ర ప్రభుత్వం 

     కేంద్ర పథకాల క్రింద రాష్ట్రానికి రావాల్సింది రూ.10,962 కోట్లు 

     ఇప్పటివరకు వచ్చింది రూ.5,615 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు (మ్యాచింగ్‌ గ్రాంట్‌) నిధులు విడుదల చేయకపోవటం, ఇప్పటికే కేంద్రం విడుదల చేసిన వాటికి సంబంధించిన యుటిలైజెషన్‌ సర్టిఫికెట్లు (యూసీ) పంపకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో అన్ని విభాగాల్లో కేంద్ర పథకాల అమలు నిస్తేజంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.10,962 కోట్లు రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం రూ.5,615 కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానాకు జమయ్యాయి. ఆ ప్రకారం సగం నిధులే కేంద్రం విడుదల చేసింది. 

మిగిలింది మూడు నెలలే.. 
మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలల వ్యవధి మాత్రమే మిగిలింది. తొమ్మిది నెలల్లో కేంద్రం నుంచి సగం నిధులే రావటం.. మిగతా నిధులు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతుండటం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను మ్యాచింగ్‌ గ్రాంట్‌ వాటాగా జోడించి ఖర్చు చేయాలి. అంటే ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులకు మరో రూ.2,200 కోట్ల వాటాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ రాష్ట్రం కేటాయించలేదు. దీంతో కీలకమైన శాఖల్లో కేంద్ర పథకాల అమలు, సంబంధిత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రధానంగా వ్యవసాయ శాఖలో రైతు రుణమాఫీకి భారీగా నిధులు కేటాయించటంతో వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రియ వ్యవసాయం.. తదితర కేంద్ర పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, ప్రజా పంపిణీ వ్యవస్థల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పటివరకు ఇచ్చిన నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువీకరణ పత్రాలు(యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు) పంపిస్తేనే తదుపరి విడత నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటును సర్దుబాటు చేయటంతోపాటు యూసీలు పంపించేందుకు ఇప్పటికిప్పుడు హడావుడి పడుతోంది. 

కేంద్ర, రాష్ట్రాల చెరో తీరు.. 
నిధుల మంజూరు, కేటాయింపులకు సంబంధించి కేంద్రం ఒక తీరుగా.. రాష్ట్రం మరో తీరుగా లెక్కలు చెప్పుకుంటున్నాయి. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో.. తెలంగాణకు కేంద్రం రూ.లక్ష కోట్లు విడుదల చేసిందని వ్యాఖ్యానించారు. అయితే అందులో సగం కూడా రాలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గణాంకాలతో సహా ఎండగట్టిన తీరు అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ నిధుల విడుదల విషయంలో కేంద్ర, రాష్ట్రాలు తలోతీరుగానే లెక్కలేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణకు రూ.21 వేల కోట్లు మంజూరు చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందులో రూ.19,601 కోట్లు విడుదల చేసినట్లు వెబ్‌సైట్‌లో వెల్లడించింది. కానీ ఇవన్నీ రాష్ట్రానికి వచ్చిన నిధులు కావని రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ఈ ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేవలం రూ.5,615 కోట్లు మాత్రమే జమయ్యాయని చెబుతోంది. 

కేంద్ర సంస్థల నిధులూ రాష్ట్రం లెక్కలకిందే.. 
తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, వాటి నిర్వహణకు కేటాయించిన నిధులను సైతం రాష్ట్రానికి ఇచ్చినట్లుగా కేంద్రం లెక్కలేసుకుంటోంది. సీసీఎంబీ, ఐఐసీటీలకు ఇచ్చిన నిధులను రాష్ట్రానికి ఇచ్చినట్లు చెప్పుకుంటోంది. అందుకే కేంద్రం చెప్పే లెక్కలకు, రాష్ట్రం చెప్పే గణాంకాలకు పొం తన కుదరటం లేదు. కేవలం కేంద్ర ప్రాయోజిత పథకాలకు విడుదల చేసిన నిధులనే రాష్ట్రానికి ఇచ్చిన నిధులుగా కేంద్రం గతంలో పరిగణించేది. అయితే అందుకు భిన్నమైన విధానాన్ని ప్రస్తుతం కేంద్రం ఎంచుకోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది.  

మరిన్ని వార్తలు