‘ఆరోగ్యలక్ష్మి’కి నగదు బదిలీ

3 Nov, 2016 01:48 IST|Sakshi
‘ఆరోగ్యలక్ష్మి’కి నగదు బదిలీ

ఇకపై గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార నిధులు
పైలట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రం ఎంపిక
పూర్తిస్థాయి వివరాలు పంపాలన్నకేంద్ర ప్రభుత్వం
త్వరలో నివేదిక సమర్పించనున్నరాష్ట్ర యంత్రాంగం

సాక్షి, హైదరాబాద్‌:
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో నగదు బదిలీ (డీబీటీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యమైన గర్భిణులు, బాలింతల పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేసి.. దానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయాలన్నది తాజా నిర్ణయం. ఆరోగ్యలక్ష్మి పేరుతో రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలవుతుంది. అంగన్‌వాడీల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల్లో తొలి విడతగా దీన్ని నగదు బదిలీ కిందకు మార్చనుంది. ఇలా చేయడం వల్ల పౌష్టికాహార పంపిణీలో జరుగుతున్న అవకతవకలకు చెక్‌ పెట్టడంతోపాటు అర్హులకు నేరుగా లబ్ధి కలగనుందని కేంద్రం నిశ్చితాభిప్రాయానికి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఆరోగ్యలక్ష్మి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను పంపాలని రాష్ట్రాన్ని కేంద్రం కోరింది. ఆ మేరకు త్వరలో పూర్తి వివరాలను నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 4,01,902 మంది గర్భిణులు, బాలింతలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అరోగ్యలక్ష్మి కింద ఒక్కో లబ్ధిదారుకు ప్రతిరోజు పప్పుతో కూడిన భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు, ఒక గుడ్డు అందిస్తారు. నిత్యం సంబంధిత అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి లబ్ధిదారులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఒక్కో లబ్ధిదారుపై ప్రతిపూట రూ.21 ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, ఏటా రూ.303.83 కోట్లు వెచ్చిస్తోంది.

భారీగా అవకతవకలు
ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు ఆ శాఖ విజిలెన్స్‌ విభాగం తనిఖీల్లో బహిర్గతమైంది. పలుచోట్ల లబ్ధిదారుల హాజరు, పౌష్టికాహార పంపిణీలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. వాస్తవంగా గర్భిణులు, బాలింతలు ప్రతిరోజు అంగన్‌వాడీ కేంద్రానికి రావడాన్ని కష్టంగా భావిస్తున్నారు. చాలాచోట్ల దొడ్డు బియ్యంతో వండిన భోజనాన్ని నిరాకరిస్తున్నారు. వండిన పదార్థం కాకుండా ముడిసరుకు ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో సగానికిపైగా లబ్ధిదారులు ఈ కేంద్రాలకు రావడం లేదు. కాని అంగన్‌వాడీల్లో మాత్రం భారీ హాజరు శాతాన్ని చూపుతున్నారు. దీంతో సరుకులు దారి తప్పుతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఇలాంటి అవకతవకలను విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. ఇలా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుండటంతో నగదు బదిలీ ప్రక్రియను అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
 

మరిన్ని వార్తలు