వచ్చే ఎన్నికల్లో మాకు నోటిచ్చి ఓటేస్తారు

20 Nov, 2016 19:02 IST|Sakshi
వచ్చే ఎన్నికల్లో మాకు నోటిచ్చి ఓటేస్తారు

పెద్ద నోట్ల రద్దుపై ప్రజల నుంచి అనూహ్య స్పందన
విలేకర్ల సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ

హైదరాబాద్:
దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దత్తాత్రేయ ఏం చెప్పారంటే 'సామాన్యులు ఇబ్బంది పడుతున్నా... ప్రధాని మోదీ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. నలభై ఏళ్ల క్రితం జనతా పార్టీకి ప్రజలు నోటిచ్చి ఓటేశారు. వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి పునరావృతమవుతుంది. మా ప్రభుత్వాన్ని రోజురోజుకు ప్రజాధరణ పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 78శాతం ప్రజలు మోదీకి మద్దతు పలికారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు ఇది రెట్టింపు’’  అని  పేర్కొన్నారు.

రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, కార్మిక వర్గాలకు కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవమేనన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దత్తాత్రేయ చెప్పారు. కార్మికుల నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, మార్కెట్ల వద్ద మొబైల్ ఏటీఎం సౌకర్యాన్ని విస్తృతం చేస్తామన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోదీని కలవనున్నట్లు చెప్పారు.