‘ఉపాధి’ పర్యవేక్షణలో తెలంగాణ భేష్‌

10 Jan, 2018 03:18 IST|Sakshi

     పథకంపై ఆ రాష్ట్ర పర్యవేక్షణ విధానాలు ఆదర్శంగా తీసుకోవాలి

     ఏపీతో సహా అన్ని రాష్ట్రాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ

సాక్షి, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయిలోనూ మెరుగైన పర్యవేక్షణ కొనసాగిస్తోందని, పరిపాలన పరమైన ఉత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అపరాజిత సారంగి సోమవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు.

ఉపాధి పథకం మరింత పారదర్శకంగా అమలు చేసేందకు పథకంలో చేపట్టిన పనుల వివరాలను ఆయా గ్రామాల్లో ఒక గోడపై అందరికీ తెలిసేలా రాయడం.. ప్రతి గ్రామ పంచాయతీలో పనులపై ఏడు రిజిస్టర్లను నిర్వహించడం, జాబ్‌కార్డుల జాబితాను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం వంటి అంశాలపై స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాల్సిన విధానాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కొద్ది రోజుల కిత్రం అన్ని రాష్ట్రాల అధికారులతో ఢిల్లీలో సమావేశం కూడా నిర్వహించింది. జిల్లా, బ్లాక్‌ లేదా మండల స్థాయిలో ఆయా అంశాలను సమర్ధవంతంగా అమలుకు కేంద్రం చేసిన సూచనలను పాటించడంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మెచ్చుకుంది. అన్ని రాష్ట్రాలూ తెలంగాణ చేపట్టిన చర్యలను పరిశీలించి, పాటించాలని సూచించింది.  

మరిన్ని వార్తలు