కేసీఆర్‌ను మెచ్చుకోవడంలో ఆంతర్యమేమిటో!

3 Jan, 2017 03:41 IST|Sakshi
కేసీఆర్‌ను మెచ్చుకోవడంలో ఆంతర్యమేమిటో!

►  గవర్నర్‌ను ప్రశ్నించిన చాడ
► కేసీఆర్‌ పాలన మేడిపండు చందంగా ఉందని విమర్శ
► ప్రభుత్వ వైఫల్యాలపై  మిలిటెంట్‌ తరహా ఉద్యమాలు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మేడిపండు చందంగా సాగుతున్న కేసీఆర్‌ ప్రభుత్వ పాలన గవర్నర్‌ నరసింహన్ కు కనిపించడం లేదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. మేడిపండు వంటి ఈ పాలనను విప్పిచూస్తే కాని గవర్నర్‌కు వాస్తవ పరిస్థితులు అర్థం కావన్నారు. గతంలో ఏ సీఎంనూ గవర్నర్‌ పొగిడిన దాఖలాలు లేవని, అటువంటిది సీఎం కేసీఆర్‌ను మెచ్చుకోవడంలో ఆంతర్యమేమిటో గవర్నర్‌ వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ పొగడ్తల వర్షం కురిపించడానికి కేసీఆర్‌ సాధించిన ఘనకార్యమేమిటో అర్థం కావడం లేదన్నారు.

సోమవారం మగ్దూంభవన్ లో పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, ఈర్ల నర్సింహ, ఎం.ఆదిరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చర్యలు, విధానాలతో ప్రజలు నలిగిపోతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలు, వివిధ వర్గాల సమస్యలపై మార్చిలో మిలిటెంట్‌ తరహా ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నామని చెప్పారు.

9న పెద్దనోట్ల రద్దుపై నిరసన...
పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు చాడ తెలిపారు. డబుల్‌ ఇళ్ల నిర్మాణంలో వైపల్యం, ప్రభుత్వం ఇచ్చిన ఇతర హామీల అమలులో వైఫల్యంపై మార్చిలో పాదయాత్రల ద్వారా పల్లెపల్లెకు సీపీఐ, జనవరి, ఫిబ్రవరిలో సం స్థాగత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు