నగరంలో చెలరేగిన చైన్ స్నాచర్లు

7 May, 2015 23:10 IST|Sakshi

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గురువారం ఒక్క రోజే నాలుగు చోట్ల మొత్తం 14 తులాల బంగారు గొలుసులు తెంపుకొని పోయారు. స్నాచింగ్‌లన్నీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 ప్రాంతంలోనే జరిగాయి. బ్లాక్ పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులే వీటన్నిటికీ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆగంతకుల వయస్సు 25 ఏళ్ళలోపే ఉంటుందని, ఒకరు క్యాప్ పెట్టుకుని ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఒక వ్యక్తి నేపాల్‌కు చెందిన వాడిలా జుట్టు పెంచి ఉన్నాడని తెలుస్తోంది.

ఈ పోలికలు ఉన్నవారు కాలనీల్లో సంచరిస్తున్నట్లు గమనిస్తే సమాచారం ఇవ్వాలని సరూర్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణప్రసాద్ సూచించారు. చైతన్యపురి డీఎస్‌ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీన్‌హిల్స్ కాలనీ రోడ్ నంబరు 3లో నివాసముండే శామ్యూల్ భార్య ఎంజీ కుసుమ (60) గురువారం సాయంత్రం ఇంటి సమీపంలోని బేకరీకి వెళ్లి వస్తుండగా పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాగారు. ఆమె ప్రతిఘటించటంతో ఒకటిన్నర తులాల గొలుసు దుండగులకు చిక్కింది. సరూర్‌నగర్ స్టేషన్ పరిధిలోని గాయత్రీనగర్‌కు చెందిన లలిత (65) చెరుకుతోట కాలనీలో నడిచి వెళ్తుండగా హుడా కాలనీ వద్ద ఎదురుగా బైకుపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు.

వనస్థలిపురంలో పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైకోర్టు కాలనీకి చెందిన జయంతి రామజోజలక్ష్మీ (38) గురువారం మధ్యాహ్నం సుభద్రనగర్ వైపు నడిచి వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు నాలుగు తులాల పుస్తెలతాడు, రెండు తులాల నల్లపూసల గొలుసును లాక్కెళ్లారు. అదేవిధంగా, ఎల్‌బీనగర్ శివగంగకాలనీకి చెందిన కె.రమణమ్మ (40) మధ్యాహ్నం రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా బైకుపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు.

మరిన్ని వార్తలు