సెల్‌ఫోన్లు కూడా బాబే తెచ్చారా?

30 Mar, 2016 02:10 IST|Sakshi
సెల్‌ఫోన్లు కూడా బాబే తెచ్చారా?

♦ బాబు జమానా కంటే వైఎస్ హయాంలో ఐటీ విస్తరణ ఎక్కువ
♦ వాస్తవాలను విస్మరించి బాబు భజన చేస్తున్నారు
♦ అసెంబ్లీలో వైఎస్ జగన్ మండిపాటు
 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ల జమానా కంటే సీఎంగా ఐదేళ్ల వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఐటీ వేగంగా విస్తరించిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అధికారం కోల్పోయే నాటికి ఐటీ ఎగుమతుల్లో ఏపీ దేశంలో 5వ స్థానంలో ఉంటే, వైఎస్ హయాంలో 3వ స్థానానికి ఎదిగిందని గుర్తుచేశారు. బాబు హయాంలో ఐటీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. సెల్‌ఫోన్లు కూడా చంద్రబాబే తెచ్చారని ఐటీ మంత్రి చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

పద్దులపై మంగళవారం శాసన సభలో జరిగిన చర్చకు మంత్రులు సమాధానం ఇచ్చారు. ఐటీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పిన సమాధానం పట్ల విపక్ష నేత వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవాలను విస్మరించి బాబు భజన చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ విస్తరణ, అందుబాటులోకి వచ్చిన ఉద్యోగాలు, ఐటీ ఎగుమతుల విలువ.. తదితర పలు వివరాలను గణాంకాలతో సహ సభ ముందు ఉంచారు.

 మైనార్టీలకు కేటాయింపులు సరే.. ఖర్చేది?
 మైనార్టీ సంక్షేమానికి తెలుగుదేశంప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసినట్లు ఘనంగా చెబుతోందని, కానీ వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తం తక్కువగా ఉందని విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 2015-16లో రూ.370 కోట్లు కేటాయించి రూ.209.93 కోట్లే ఖర్చు చేశారని, మిగిలిన రూ.160 కోట్లు ఖర్చు పెట్టలేదని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.701 కోట్లు కేటాయించామని ఘనంగా చెబుతున్నారని అన్నారు. ఖర్చు పెట్టకుండా భారీ కేటాయింపుల గురించి చెప్పుకోవడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు.

 జగన్‌కు కంప్యూటర్ల గురించి తెలియదు: పల్లె
 ఐటీ ఎగుమతుల గురించి విపక్ష నేత జగన్ గట్టిగా నిలదీయడంతో మంత్రి పల్లె రఘునాథరెడ్డి అసలు విషయాన్ని వదిలిపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగారు. జగన్‌కు కొడవళ్లు, బాంబులు, కత్తుల గురించి మాత్రమే తెలుసని, కంప్యూటర్లు, ట్యాబ్‌ల గురించి తెలియదని అన్నారు. ఐటీ రంగంలో బాబుకున్న పేరు మరెవరికీ లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న విలువ మరే నాయకుడికి లేదన్నారు. మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన రూ.370 కోట్లలో ఇప్పటివరకు రూ.273.19 కోట్లు ఖర్చు చేశామన్నారు. మార్చిలో చేసిన వ్యయం బడ్జెట్ పుస్తకాల్లో లేదన్నారు. అంతకుముందు పద్దులపై జరిగిన చర్చకు పల్లె సమాధానం ఇచ్చారు. ముస్లింలకు వైఎస్ కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, సుప్రీం కోర్టులో వాదించడానికి ఉద్ధండులైన న్యాయవాదులను నియమించిందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐటీ రంగంలో 2029 నాటికి ఏపీని దేశంలో నంబర్ వన్‌గా నిలిపేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.

మరిన్ని వార్తలు