'అనుమతి లేకుండా చంద్రబాబు భవన నిర్మాణం'

18 Jun, 2015 19:54 IST|Sakshi
'అనుమతి లేకుండా చంద్రబాబు భవన నిర్మాణం'

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైదరాబాద్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.65లో ఆయన చేపడుతున్న ఇంటి నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతి మంజూరు కాలేదు. ఈ విషయాన్ని స్వయంగా జీహెచ్ఎంసీయే ప్రకటించింది. ఇప్పటివరకు భవన నిర్మాణానికి పెట్టుకున్న దరఖాస్తును అనుమతించలేదంటూ చెబుతుండగా, తాము రెండు రోజుల క్రితమే ఆ దరఖాస్తును తిరస్కరించామని ఇప్పుడు జీహెచ్ఎంసీ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ దరఖాస్తు తమ వద్ద పెండింగులో లేదని తెలిపాయి.

చంద్రబాబు, లోకేష్ మే 18వ తేదీన జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారని, అయితే లే అవుట్ ప్రకారం చూస్తే భవనం ఎత్తు, నిర్మాణ సెట్ బ్యాక్ నిబంధనలకు అనుగుణంగా లేవని జీహెచ్ఎంసీ తెలిపింది. అందుకే తాము ఈనెల 16వ తేదీన చంద్రబాబు, లోకేష్ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించామంది. అయితే.. అనుమతి లేకుండానే అక్కడ భవన నిర్మాణానికి పిల్లర్లు వేశారని, ఇప్పటివరకు దీనిపై వచ్చిన కథనాలు అవాస్తవమని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.

అయితే, సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినియోగిస్తున్న భవనాలకు ఆస్తి పన్ను కడితేనే తన ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తామని మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారంటూ చంద్రబాబు నాయుడు బుధవారం నాడు కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. దాదాపు నెలన్నర నుంచి తన దరఖాస్తును అనుమతించకుండా పెండింగులో ఉంచారని ఆయన అన్నారు. సెక్షన్ 8 అమలులో లేకపోవడం వల్లే హైదరాబాద్ నగరంలో స్వయంగా తాను కూడా ఇబ్బందుల పాలవుతున్నానని చెప్పారు. అయితే ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్ ఉందన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. ఇప్పుడు నిబంధనలను అతిక్రమించడం వల్లే దరఖాస్తు తిరస్కరించినట్లు జీహెచ్ఎంసీ చెప్పడం గమనార్హం.

మరిన్ని వార్తలు