ఓటుకు డబ్బు తీసుకోవడం అవినీతి కాదు...

18 Nov, 2016 00:47 IST|Sakshi
ఓటుకు డబ్బు తీసుకోవడం అవినీతి కాదు...

- ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు న్యాయవాది వాదన
- ఇందుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదు
- ముగిసిన వాదనలు..తదుపరి విచారణ 22కు వారుుదా  
 
 సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు తీసుకుంటే అది అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) పరిధిలోకి రాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పునరుద్ఘాటించారు. ఓటు వేయడమన్నది ప్రజా విధుల్లో భాగం కాదని, అది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యత మాత్రమేనని ఆయన తెలిపారు. అంతేకాక ఎన్నికై న వ్యక్తి ప్రజా సేవకుడిగా బాధ్యతలు నిర్వరిస్తున్న సందర్భంలో అవినీతికి పాల్పడితే అప్పుడు మాత్రమే పీసీ యాక్ట్ వర్తిస్తుందని ఆయన వివరించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి జరుపుతున్న విచారణ సందర్భంగా లూథ్రా ఈ వ్యాఖ్యలు చేశారు.

 ఒకే కేసులో రెండు ఎఫ్‌ఐఆర్‌లు చెల్లవు..
 ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న వారు ప్రజా సేవకుల నిర్వచన పరిధిలోకి వస్తారే తప్ప, ఓటర్లు, ఎన్నికల బరిలో ఉన్న వారు ప్రజా సేవకుల కిందకు రారని సిద్ధార్థ లూథ్రా చెప్పారు. సభ లోపల జరిగే ఓటింగ్‌కు, సభ వెలుపల జరిగే ఓటింగ్‌కు మధ్య స్పష్టమైన తేడా ఉందని ఆయన వివరించారు.  ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఆర్‌పీసీ సెక్షన్ 210 కింద ఫిర్యాదు చేశారని, చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించడానికి ముందే ఈ సెక్షన్ కింద దర్యాప్తునకు ఆదేశించాల్సి ఉంటుందని లూథ్రా పేర్కొన్నారు. అరుుతే ఏసీబీ కోర్టు మాత్రం చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన తరువాతే ఫిర్యాదుపై స్పందిస్తూ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. అంతేకాక ఫిర్యాదుదారు సెక్షన్ 210 కింద ఫిర్యాదు చేస్తే ప్రత్యేక కోర్టు సెక్షన్ 156(3) కింద దర్యాప్తునకు ఆదేశించిందని, ఇది ఎంత మాత్రం సరికాదని ఆయన వివరించారు.

ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిపాలన ఉత్తర్వులుగా ఫిర్యాదుదారు చెబుతున్నారని, 156(3) కింద కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అవి జ్యుడీషియల్ ఉత్తర్వులే అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు జారీ చేసే ముందు ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోందన్న విషయం కింద కోర్టుకు స్పష్టంగా తెలుసన్నారు. కాబట్టి రామకృష్ణారెడ్డి ఫిర్యాదును కింది కోర్టు తిరస్కరించాల్సిందని, అరుుతే ఆ పని చేయకుండా దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించిందని తెలిపారు. ఈ ఆదేశాల వల్ల ఏసీబీ మరోసారి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఒకే కేసులో రెండు ఎఫ్‌ఐఆర్‌లు చెల్లవని ఆయన చెప్పారు.

 విచారణ 22కు వాయిదా..
 కేసుతో సంబంధం లేని థర్డ్‌పార్టీ ఇచ్చిన ఫిర్యాదును విచారించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులున్నప్పటికీ, ఆ విషయాన్ని కింది కోర్టు పట్టించుకోలేదన్నారు. దర్యాప్తునకు ఆదేశించేందుకు ఫిర్యాదు దాఖలు వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా? తదితర విషయాలను కింది కోర్టు పరిశీలించలేదన్నారు. ఓ క్రిమినల్ కేసులో బాధితుడు లేదా ఫిర్యాదిదారు, నిందితుడు, ప్రాసిక్యూటర్ వీరు ముగ్గురికే పాత్ర ఉంటుందన్నారు. ఈ ముగ్గురు కాక నాల్గో వ్యక్తికి కేసులో జోక్యం చేసుకునే అర్హత ఎంత మాత్రం ఉండదంటూ ఆయన తన వాదనలను ముగించారు. ఈ వాదనల సందర్భంగా ఆయా న్యాయవాదులు ప్రస్తావించిన సుప్రీంకోర్టు తీర్పుల వివరాలను అందచేసేందుకు వీలుగా తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 22కు వారుుదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు సాగడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రరుుంచారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు