కేసీఆర్, చంద్రబాబు కుమ్మక్కయ్యారు: శ్రవణ్

1 Feb, 2016 04:14 IST|Sakshi
కేసీఆర్, చంద్రబాబు కుమ్మక్కయ్యారు: శ్రవణ్

సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల వారి కపటం... నారా వారి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్, ఆంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. ఇద్దరు సీఎంల డ్రామాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు బలవుతున్నారన్నారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కేసీఆర్‌కు చంద్రబాబు అన్న అయ్యారట. వదిన భువనేశ్వరి అన్న(కేసీఆర్)కే ఓటు వేస్తానని చెప్పిందట. ఇక కేటీఆర్.. తమ్ముడూ లోకేశ్ అంటూ ట్వీట్ చేస్తడు. అందుకు లోకేశ్ కూడా అన్న కేటీఆర్ అంటూ ట్వీటర్‌లో ప్రేమ ఒలకబోసుకుంటారు.

వీరిద్దరికీ తక్కువేమి కాదన్నట్లు ఎంపీ కవిత... తమ్ముడు లోకేశ్‌కు లోకం తెల్వదు అంటది. ఏమిటీ ప్రేమలు. మీ రెండు కుటుంబాలు బాగనే ఉన్నయి. మధ్యలో పేద ప్రజలను బలిపశువులను చేద్దామనుకుంటున్నారా’ అని శ్రవణ్ ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు ఏమైందో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ‘చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పిన కేసీఆర్ విజయవాడ వెళ్లి రొయ్యల పులుసు తిని వస్తడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ప్రభుత్వమే కుప్పకూలిపోతదన్న చంద్రబాబు కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లి అలయ్ బలయ్ చేసుకుంటడు’ అన్నారు. బీజేపీ నేతలు కూడా కేసీఆర్‌తో మిలాఖత్ అయ్యారన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు కార్ల కాంట్రాక్టు ఇచ్చారని, ఇక దత్తాత్రేయ కేసీఆర్ పల్లకి మోస్తున్నారని అన్నారు.

మరిన్ని వార్తలు