సింగపూర్ తో బాబు రాయ‘బేరం’

13 Sep, 2016 13:02 IST|Sakshi
సింగపూర్ తో బాబు రాయ‘బేరం’

చంద్రబాబు సింగపూర్ తో రాయ‘బేరం’ సాగిన క్రమం ఇదీ...

*నవంబర్ 12, 2014: చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి సింగపూర్‌లో పర్యటించి.. అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరం నిర్మాణానికి సహకరించాలని ఆ దేశాన్ని కోరారు.
* డిసెంబర్ 8, 2014: రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీ కోసం సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ ఐఈ, రాష్ట్ట ప్రభుత్వ రంగ సంస్థ ఇన్‌క్యాప్‌ల మధ్య ఒప్పందం
* ఏప్రిల్ 22, 2015: రాజధాని మాస్టర్ డెవలపర్‌ను స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎంపిక చేయాలని కేబినెట్‌లో తీర్మానం. మాస్టర్ డెవలపర్‌ను నామినేట్ చేయాలని కోరుతూ సింగపూర్‌కు లేఖ
* ఏప్రిల్ 30, 2015: సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజస్(ఐఈ)ను మాస్టర్ డెవలపర్‌గా నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సింగపూర్ సర్కార్ లేఖ
* మే 7, 2015: అసెండాస్, సిమ్‌బ్రిడ్జ్, సెమ్బ్ కార్ప్ సంస్థలను మాస్టర్ డెవలపర్‌గా నామినేట్ చేస్తూ ప్రభుత్వానికి సింగపూర్ సర్కార్ మరో లేఖ
* మే 26, 2015: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ఒపీపీ ప్రతిపాదనలు పంపాలని సింగపూర్ సంస్థల కన్సార్టియంకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
* అక్టోబరు 30, 2015: ప్రభుత్వానికి సింగపూర్ సంస్థల కన్సార్టియం ప్రతిపాదనల సమర్పణ
* జనవరి 24, 2016: సింగపూర్‌కు వెళ్లి కన్సార్టియంతో సీఎం చంద్రబాబునాయుడు చర్చలు
* మే 17, 2016: సింగపూర్ ప్రభుత్వంతో ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ చర్చలు
 *మే 21, 24, 25, 2016: సింగపూర్ ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల కన్సార్టియంతో మంత్రి యనమల నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ చర్చలు
 *జూన్ 7, 2016: సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చలు జరిపిన సీఎం చంద్రబాబునాయుడు

..........................................................................................................................................................................
కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం స్విస్ చాలెంజ్ పద్ధతిలో తమ బినామీలైన సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి దోచుకునేందుకు పన్నిన కుట్రను కోర్టు నమ్మి స్టే ఇచ్చిందని, ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు తీర్పుతోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పేరుతో చేస్తున్న దోపిడీని మానుకోవాలని హితవు పలికారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి రైతుల వద్ద లాక్కున్న వేల ఎకరాల భూములను విదేశీ కంపెనీలకుకట్టబెట్టడమేకాక, వాటికి కోట్లాది రూపాయల ప్రజాధనంతో మౌలిక వసతులు కల్పించడాన్ని చూస్తే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుందన్నారు. గతంలో స్విస్ చాలెంజ్ పద్ధతి సరికాదని సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ఎన్నోసార్లు తీర్పులు వెలువరించిన సందర్భాలున్నా.. చంద్రబాబు మాత్రం దానికే ఎందుకు మొగ్గుచూపుతున్నారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
 
ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి రావాలి: సీపీఐ
రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ దేశంలో కాంట్రాక్టర్లు, బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలెవ్వరూ లేనట్టూ, విదేశీ సంస్థలు ప్రత్యేకించి సింగపూర్ సంస్థలైతే మేలన్నట్టు వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు ఆదేశం చెంపపెట్టని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. స్విస్ చాలెంజ్‌పై హైకోర్టు స్టే ఉత్తర్వులతోనైనా చంద్రబాబు ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన రాజధాని నిర్మాణాన్ని తన సొంత ఇంటి నిర్మాణంగా భావిస్తే ఇలాగే ఉంటుందని చెప్పారు.
 
మ్యాచ్ ఫిక్సింగ్ మరోసారి బయటపడింది: సీపీఎం
సింగపూర్ కంపెనీలతో ప్రభుత్వం ముందుగానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని, టెండర్లను ఆ కంపెనీలకే కట్టబెట్టే రీతిలో నిబంధనలు రూపొందించారనేది హైకోర్టు ఆదేశాలతో మరోసారి వెల్లడైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. రాజధానిలో వేలఎకరాల భూములను విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు పిలిచిన స్విస్ ఛాలెంజ్ టెండర్‌ను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సీపీఎం స్వాగతించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేపై ఫుల్‌బెంచ్‌కీ అప్పీలు చేసే ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
 
 ప్రభుత్వం పునరాలోచించుకోవాలి: బీజేపీ
హైకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో స్విస్ చాలెంజ్ ప్రక్రియ విషయంలో పునరాలోచన చేయాలని టీడీపీ మిత్రపక్షం బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి సూచించారు. స్విస్ విధానంలో పారదర్శకత ఉండదని.. ఆ విషయాన్ని బీజేపీ మొదటి నుంచీ చెబుతూ వస్తుందని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి వ్యవహారం పారదర్శకతతో సాగాలన్నారు.
 
 హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: జేపీ
స్విస్ ఛాలెంజ్ విధానంలో నూతన రాజధాని నిర్మాణ ప్రక్రియపై హైకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నామని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు ఏమి చేసినా పారదర్శకంగా, తాము చేసిది ప్రజలందరికీ తెలిసే చేయాలి. ప్రజలకు అర్థంకాని రీతిలో చేయాలనుకోవ డం సమాచార హక్కు చట్ట ప్రకారం నేరమే అవుతుందన్నారు. ఇకైనె నా రాజధాని నిర్మాణ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్ధేశాలు, అనుసరించే విధానాలను ప్రజలందరికీ తెలియజేసిన తర్వాత ముందుకెళ్లాలని జేపీ సూచించారు.

 రాజధాని నిర్మాణంలో పారదర్శకత ఉండాలి
 స్విస్ చాలెంజ్‌ను రద్దు చేయాలి...: ‘రాజధాని నిర్మాణంలో జరిగిన రహస్య ఒప్పందాలకు హైకోర్టు ఇచ్చిన స్టే నిదర్శనం. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, నిపుణులు సైతం ఈ విధానాన్ని వ్యతిరేకించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్విస్ చాలెంజ్‌ను రద్దుచేయాలి.’ అని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు.
 
సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి
రాజధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానంపై ఉమ్మడి హైకోర్టు స్టే విధించడం సమంజసమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి చెప్పారు. రాజధాని అంశాలను పారదర్శకంగా ఎందుకు పెట్టడం లేదని గతంలో కోర్టు కామెంట్ చేసిందని, తర్వాత కూడా సరి చేసుకోకపోవడం వల్ల మొత్తం ప్రభుత్వం నవ్వుల పాలైందన్నారు. రాజధాని నిర్మాణం కోసం వేలకోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసేటప్పుడు జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని డిమాండ్ చేసారు.
 
 హైకోర్టు స్టేతోనైనా బాబు కళ్లు తెరవాలి: రఘువీరా
 స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టు సోమవారం ఇచ్చిన స్టేతోనైనా సీఎం చంద్రబాబు కళ్లు తెరవాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ విషయంలో బోగస్ ఒప్పం దాలు, రహస్య, చీకటి ఒప్పందాలు, రైతులను వేధించడం వంటివి జరుగుతున్నాయన్నారు. ఇక్కడి వాళ్లతో రాజధానిని నిర్మిస్తే స్లమ్‌లు తప్ప మరేం కట్టరని రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచిన ఒక ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతుల అనుమతి లేకుండా బలవంతంగా వారి భూములు లాక్కొని రాజధానిని చేపట్టడం పారదర్శకతా రాహిత్యమన్నారు. వెంటనే స్విస్ చాలెంజ్ విధాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

మరిన్ని వార్తలు