జల ‘ముసాయిదా’లో మార్పులు చేయాలి

9 Jun, 2016 03:26 IST|Sakshi
జల ‘ముసాయిదా’లో మార్పులు చేయాలి

కృష్ణా జలాల వినియోగంపై గత ఏడాది చేసుకున్న ఒప్పందంలో మార్పులు కోరుతున్న తెలంగాణ
 
 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో గత ఏడాది కేంద్ర జల వనరుల శాఖ వద్ద చేసుకున్న ముసాయిదా ఒప్పందాలను ఈ ‘వాటర్ ఇయర్‌లో’నూ కొనసాగించేందుకు అంగీకరిస్తున్న తెలంగాణ, అందులో పలు మార్పులు చేయాలని పట్టుబడుతోంది. ఈ నెలాఖరులో కేంద్రం వద్ద జరిగే భేటీలో, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ పథకం కేటాయింపులకు అనుగుణంగా తెలంగాణకు నీటి కేటాయింపులు చేసే అంశంపై పూర్తి స్థాయిలో చర్చించి దాన్ని ముసాయిదాలో చేర్చాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటే నీటి వినియోగ, అవసర షెడ్యూల్‌ను ముందుగానే బోర్డుకు అందించే విషయంలో కచ్చితత్వాన్ని పాటించేలా నిబంధనలు పెట్టాలని కోరే అవకాశాలున్నాయి.

గత ఏడాది జూన్ 18, 19 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఒక ముసాయిదా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారమే ప్రస్తుతం నడుచుకుంటున్నా, అప్పుడప్పుడు కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల నియంత్రణ అంశంలో ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొనడంతో ఈ అంశం ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉంది. దీన్ని పక్కనపెడితే గత ఏడాది ఒప్పందం ప్రకారం..నికర జలాల్లో మొత్తంగా ఉన్న 811 టీఎంసీల్లో ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను తమ పరిధిలో ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ ఏడాది కూడా ఇదే విధానం కొనసాగే అవకాశం ఉంది. ఈ నీటి వినియోగం విషయంలో ఇరు రాష్ట్రాలు తమ అవసరాలను పేర్కొంటూ ముందుగానే బోర్డుకు షెడ్యూల్ అందించాలని ఒప్పందం సందర్భంగా నిర్ణయించాయి. అయితే దీనిపై ఏపీ నుంచి సరైన సమాచారం లేదన్నది తెలంగాణ వాదన. ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగ డేటాను ఇరు రాష్ట్రాలు బోర్డు ద్వారా పరస్పరం బదిలీ చేసుకోవాల్సి ఉన్నా అదీ జరగడం లేదు. దీంతో పలు సందర్భాల్లో బోర్డు సైతం నీటి విడుదలపై చేతులెత్తేస్తోంది. ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా అమలు చేసేలా ఒప్పందంలో మార్పులు చేయాలని తెలంగాణ కోరే అవకాశాలున్నాయి.
 
 మాకూ హక్కులు వస్తాయి..
 ఇక బచావత్ అవార్డు ప్రకారం..పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ అంటోంది. పోలవరానికి 80 టీఎంసీలు కేటాయిస్తే, అదే తరహాలో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు, 45 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయని అంటోం ది. దీనిని కూడా ముసాయిలో చేర్చి 45 టీఎంసీలు అదనంగా కేటాయించాలని కోర వచ్చు. అదే బచావత్ అవార్డులో పోలవరం కాకుండా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరి మాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని, 80 టీఎంసీలతో పట్టిసీమ చేపడితే తమకూ నీటివాటా దక్కాలని తెలంగాణ కోరనుంది.

మరిన్ని వార్తలు