ఎంసెట్‌ స్కాంలో చార్జిషీట్‌..!

7 Mar, 2017 23:55 IST|Sakshi

దాఖలుకు సిద్ధమవుతున్న సీఐడీ
ఇప్పటికీ చిక్కని కీలక నిందితులు
దొరికాక అనుబంధ చార్జిషీట్‌ దాఖలుకు యోచన


సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు సీఐడీ చేసిన దర్యాప్తులో మొత్తం 81 మంది బ్రోకర్లు ప్రశ్నపత్రం లీకేజ్‌లో పాత్ర వహించినట్టు వెలుగులోకి వచ్చింది. అదే విధంగా 56 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. లీకేజ్‌కు సంబంధించి కోల్‌కతా, ముంబై, పుణే, ఢిల్లీ, షిరిడీ, కటక్, బెంగళూరుల్లో క్యాంపులు ఏర్పాటుచేసి విద్యార్థులకు రెండు సెట్ల ప్రశ్నపత్రాలపై శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రశ్నపత్రం విద్యార్థులకు అందించి ఆరు ప్రాంతాల్లో క్యాంపులు నడిపిన కీలక నిందితుడు కమిలేశ్‌ కుమార్‌సింగ్‌ సీఐడీ కస్టడీలో గుండెపోటుతో మృతి చెందాడు.

ఇతడికి ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ప్రశ్నపత్రం ఇచ్చింది ఎవరో సీఐడీ ఇప్పటికే గుర్తించినా అరెస్ట్‌ చేయలేకపోయింది. కమిలేశ్‌ మృతితో పంజాబ్‌కు చెందిన డ్రోంగీ అలియాస్‌ ఎస్పీ సింగ్‌ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇతడితో పాటు మరో 8మంది బ్రోకర్లు పట్టుబడితే కేసు దర్యాప్తు పూర్తయినట్టే అని సీఐడీ భావిస్తోంది. అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై చార్జిషీట్‌ దాఖలు చేసి, తదుపరి నిందితులు దొరికిన తర్వాత అనుబంధ చార్జిషీట్‌ వేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు