చాట్ల శ్రీరాములు ఇకలేరు

19 Dec, 2015 04:13 IST|Sakshi
చాట్ల శ్రీరాములు ఇకలేరు

♦ హైదరాబాద్‌లోని మెట్టుగూడ రైల్వే ఆస్పత్రిలో కన్నుమూత
♦ నేడు ఉదయం హైదరాబాద్‌లో అంత్యక్రియలు
 
 సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత చాట్ల శ్రీరాములు ఇకలేరు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని మెట్టుగూడ రైల్వే ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య ఆదిలక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో ఉన్న స్వగృహానికి తరలించారు. శనివారం ఉదయం ఈఎస్‌ఐ ఆస్పత్రి పక్కన ఉన్న హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చాట్ల శ్రీరాములు మరణవార్త విని పెద్ద సంఖ్యలో కళాకారులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు  ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన నివాసానికి చేరుకుని, భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. నటుడు దుగ్గిరాల సోమేశ్వరరావు, దీక్షిత్, ఆచార్య మొదలి నాగభూషణశర్మ, రచయిత రావి కొండలరావు, ఆకెళ్ల, నారాయణ బాబు, నటీమణులు శివపార్వతి, హైమ, రసరంజని నాటక సంస్థ సభ్యులు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.

 నాటక రంగంలో తనదైన ముద్ర
 ఆరున్నర దశాబ్దాలుగా తెలుగు నటనా రంగానికి సేవలు అందించిన చాట్ల శ్రీరాములు.. విజయవాడలో 1931 డిసెంబర్ 15న గడ్డి అచ్చయ్య-అచ్చమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 13 ఏళ్ల వయసులోనే 1944 ఏప్రిల్ 16న మేనత్త కుమార్తె ఆదిలక్ష్మితో వివాహం జరిగింది. ఆ రోజుల్లోనే ఇంటర్ వరకు చదివారు. హిందీ భాషా పరీక్షల్లోనూ ఉత్తీర్ణులయ్యారు. అనంతరం ఓ కంపెనీలో టైపిస్ట్‌గా, మెడికల్ రిప్రజెంటివ్‌గా పనిచేస్తూ.. డిగ్రీ పూర్తిచేశారు. ఆ సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంటర్ కాలేజీ నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా బంగారు పతకం సాధించారు. అటు తర్వాత నాటకాలు, నటనా రంగంలో తనదైన ముద్ర వేశారు.

ఆధునిక తెలుగు నాటక రంగంలో నూతన ప్రక్రియలను ప్రవేశపెట్టారు. ఆయన రచించి, ప్రదర్శించిన నాటకాలు నటుడిగా, దర్శకుడిగా ఆయన గొప్పతనాన్ని చాటుతాయి. అంతేకాదు సినీ రంగంలో ఎంతో మందికి నటనలో శిక్షణ ఇచ్చారు. రంగస్థల కళాశాల శాఖలో ఆచార్యులుగా ఎంతో మందికి మెళకువలు బోధించారు. ప్రభుత్వంతో పాటు ఎన్నో సంస్థల నుంచి ఆయన గౌరవ సత్కారాలు అందుకున్నారు.

 ప్రముఖుల సంతాపం
 చాట్ల శ్రీరాములు మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చాట్ల మరణం తనను కలచి వేసిందని ఏపీ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఆధునిక తెలుగు నాటక రంగంలో సమున్నత శిఖరంగా చాట్ల శ్రీరాములు నిలిచారని, ఆయన మరణం బాధాకరమని ప్రముఖ రచయిత సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. చాట్ల రూపొందించి, ప్రదర్శించిన అనేక నాటకాలు కళాభిమానుల ప్రశంసలు అందుకున్నాయన్నారు. ఆధ్యాత్మిక రంగంలో గురువులుంటారు కానీ నాటక రంగంలో గురువుగా ఉన్న ఏకైక వ్యక్తి చాట్ల శ్రీరాములు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి పేర్కొన్నారు. ఆయన మరణంతో నాటక రంగం పెద్దదిక్కును కోల్పోయిందని వ్యాఖ్యానించారు. శ్రీరాములు మృతి పట్ల తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, తెలుగు విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ ఎల్లూరి శివారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు