చిన్న పొట్లాల్లో చీప్ లిక్కర్

9 Jun, 2016 03:15 IST|Sakshi
చిన్న పొట్లాల్లో చీప్ లిక్కర్

90 మిల్లీలీటర్ల టెట్రాప్యాక్‌లలో విక్రయాలకు సర్కారు కసరత్తు
రూ.25 నుంచి రూ.30లోపే అందించాలని యోచన
టెట్రా ప్యాక్‌ల తయారీకి ఇప్పటికే అనుమతి పొందిన మెక్‌డొవెల్ కంపెనీ

 సాక్షి, హైదరాబాద్: గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చౌక మద్యాన్ని అందుబాటులోకి తెచ్చే యత్నం చేసి వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం... ఈసారి చిన్న పొట్లాల్లో చీప్‌లిక్కర్‌ను విక్రయించే ఆలోచనను తెరపైకి తెచ్చింది. సాధారణంగా సాఫ్ట్ డ్రింకులను విక్రయిస్తున్న మాదిరిగా టెట్రా ప్యాక్‌లలో 90 ఎంఎల్ (మిల్లీలీటర్ల) పరిమాణంలో చీప్‌లిక్కర్‌ను తక్కువ ధరకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. గత సంవత్సరం ఎక్సైజ్ పాలసీలోనే 90 ఎంఎల్ చీప్‌లిక్కర్ ప్యాకెట్లను రూ.20 ధరకు అందించేలా ప్రణాళికలు సిద్ధమైనా.. వివిధ వర్గాల ప్రజలు, సామాజిక వేత్తల వ్యతిరేకతతో ప్రభుత్వం వెనకడుగు వే సింది. అతి ప్రచారం అప్పట్లో దెబ్బతీసిందని భావిస్తున్న సర్కారు ఈసారి చడీచప్పుడు కాకుండా టెట్రా ప్యాక్ మద్యాన్ని మార్కెట్‌లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

 తక్కువ ధరకు అందుబాటులోకి..
ప్రస్తుతమున్న చీప్‌లిక్కర్ 180 ఎంఎల్ ధర రూ.60 కాగా, 90 ఎంఎల్ ధర రూ.40. దీనిలో కొంచెం ఎక్కువ నాణ్యత ఉన్న చీప్ లిక్కర్ ధర 180 ఎంఎల్‌కు రూ.80గా ఉంది. అయితే గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ఉండేలా... రూ.25 నుంచి రూ.30కే 90 ఎంఎల్ చీప్‌లిక్కర్ టెట్రాప్యాక్‌ను అందించే యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. టెట్రాప్యాక్‌లపై వ్యాట్ తగ్గించడం ద్వారా రూ.25కే 90 ఎంఎల్ చీప్‌లిక్కర్‌ను అందించే అవకాశముంది. ప్రస్తుతం చీప్ లిక్కర్‌ను ప్లాస్టిక్ సీసాల్లో విక్రయిస్తున్నారు. ఈ ఖర్చు తగ్గించడంతో పాటు ఆకర్షణీయమైన ప్యాక్‌లో తక్కువ ధరకు చీప్ లిక్కర్ సరఫరా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

టెట్రా ప్యాక్‌లలో మద్యం తయారీకి గతంలోనే మెక్‌డొవెల్స్ కంపెనీకి అనుమతిచ్చారు. ఈ కంపెనీకి చెందిన డిస్టిలరీలోని ఒక లైన్‌ను టెట్రాప్యాక్‌ల తయారీకి అనుగుణంగా రూపొందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా కొద్దిరోజులు టెట్రాప్యాక్‌ల్లో ఓ రకం మద్యాన్ని కూడా సరఫరా చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారానే తొలుత ‘టెట్రాప్యాక్’ చీప్‌లిక్కర్‌ను అందించే అవకాశముంది. ప్రభుత్వం అనుమతిస్తే టెట్రాప్యాక్‌లలో చీప్‌లిక్కర్‌ను సరఫరా చేసేందుకు మరో ఐదు డిస్టిలరీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఏపీ నుంచి అక్రమ రవాణా అడ్డుకునేందుకే ...
తెలంగాణ కన్నా ఏపీలో తక్కువ ధరకు చీప్ లిక్కర్ లభిస్తోంది. అక్కడి ప్రభుత్వం చీప్‌లిక్కర్‌పై వ్యాట్‌ను గణనీయంగా తగ్గించడంతో తెలంగాణ కన్నా రూ.5 నుంచి రూ.10 తక్కువకు 180 ఎంఎల్ చీప్‌లిక్కర్ లభిస్తోంది. దీంతో నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల ద్వారా ఏపీ చీప్ లిక్కర్ తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతోందని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. టెట్రాప్యాక్‌లలో చీప్‌లిక్కర్‌ను తీసుకువస్తే అక్రమ రవాణాను నియంత్రించవచ్చని అభిప్రాయపడుతోంది. అక్టోబర్ నుంచే టెట్రాప్యాక్‌లలో చీప్‌లిక్కర్ సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు