నమ్మి మోసపోయా...

5 Jun, 2016 02:24 IST|Sakshi
నమ్మి మోసపోయా...

- వారం రోజులన్నారు...రెండు నెలలైనా నడవలేకపోతున్నా
- అంగుళం కూడా పెరగలేదు నిఖిల్‌రెడ్డి ఆవేదన
 
 సాక్షి, హైదరాబాద్: ‘డాక్టర్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయా. మూడు అంగుళాలు పెరుగుతావన్నారు. ఇప్పటివరకు అంగుళం కూడా పెరగలేదు. వారం రోజుల్లో స్వయంగా నడుస్తావని చెప్పారు. శస్త్రచికిత్స చేసి రెండు మాసాలు దాటింది. నడవడం కాదు కదా కనీసం లేచి నిలబడలేకపోతున్నా. నొప్పులకు నిద్ర కూడా పట్టడం లేదు. నరకయాతన అనుభవిస్తున్నా’ అని ఏప్రిల్ 5న గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరిగేందుకు శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు శనివారం తన ఇంట్లో విలేకరులతో మాట్లాడాడు. ‘ఎత్తు పెంచుతామన్న వైద్యుల మాటలు నమ్మి మోసపోయా.

శస్త్రచికిత్స గాయాలు ఇంకా మానలేదు. తరచూ ఇన్‌ఫెక్షన్ వస్తోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సమయంలో తానే రెండు రోజులకోసారి ఇంటికి వచ్చి చికిత్స చేస్తానని డాక్టర్ చంద్రభూషణ్ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ తర్వాత నన్ను పట్టించు కోకుండా వదిలేశారు. కనీసం పది రోజులకోసారి కూడా రావడం లేదు. ఇకపై నాలాగా మరెవరూ మోసపోవద్దు. ఇంట్లో చెప్పకుండా శస్త్రచికిత్స చేయించుకుని నేను బాధపడటమే కాకుండా ఇంట్లో వారిని కూడా ఇబ్బంది పెడుతున్నా’ అని నిఖిల్ చెప్పాడు. గాయాలు   పచ్చిగానే ఉన్నాయని, నొప్పులతో కుమారుడు పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోతున్నామని నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై  చర్చలు జరపడానికి వైద్యులు ఇంటికి వస్తామన్నారని, కానీ మీడియా కూడా వస్తుందని తెలియడంతో రాలేదని వెల్లడించారు. దీనిపై అన్నిరకాలా న్యాయపోరాటం చేస్తానన్నారు.
 
 1.1 ఇంచులు పెరిగాడు...
 చికిత్స విజయవంతమైంది. శస్త్రచికిత్సకు ముందుతో పోలిస్తే ప్రస్తుతం నిఖిల్ 1.1 ఇంచుల ఎత్తు పెరిగాడు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఎందుకో తెలియదు కానీ... నిఖిల్ కుటుంబ సభ్యులు చికిత్స నిలిపివేయమంటున్నారు. వారి వాదనలను న్యాయవాది సమక్షంలో వీడియో రికార్డు చేసి, ఆ తర్వాతే చికిత్స నిలిపివేస్తాం. ఆ తర్వాత వెయిట్ బేరింగ్ ప్రక్రియతో నడిచేలా చర్యలు తీసుకుంటాం. అతడిని పట్టించుకోవడం లేదనే ఆరోపణల్లో వాస్తవం లేదు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నా. నిఖిల్ ఇంటికి కూడా వెళ్తున్నా.    
     - డాక్టర్ చంద్రభూషణ్,  చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, గ్లోబల్ ఆస్పత్రి

మరిన్ని వార్తలు