ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల!

4 May, 2015 22:25 IST|Sakshi
శ్రీకాంత్

అడ్డగుట్ట (హైదరాబాద్): పెళ్లైనా... పరస్త్రీలతో రాసలీలలు సాగిస్తూ.. వారిని నిలువునా వంచిస్తున్న ఓ కామాంధుడిని కట్టుకున్న ఇల్లాలే పోలీసులకు పట్టిచ్చింది. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన జీ. శ్రీకాంత్‌కు, నగరంలోని గౌలిగూడకు చెందిన మాధవితో 2012లో వివాహం జరిగింది. ఇద్దరికీ అది రెండో వివాహం.


ఈస్ట్ మారేడుపల్లిలో నివాసం ఉంటున్న వీరికి కవల పిల్లలు సంతానం. కాగా, శ్రీకాంత్ తుర్కపల్లిలోని ఓ కంపెనీలో రీసెర్చ్ కెమిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు పెళ్లి అయినప్పటి నుంచి భార్యను తరచూ వేధింపులకు గురిచేస్తుండేవాడు. తనకు వివాహం కాలేదంటూ సహచర ఉద్యోగినులతో పాటు ఇతర అమ్మాయిలను నమ్మించి వంచించడం అలవాటుగా మార్చుకున్నాడు. వారితో ఏకాంతంగా గడుపుతూ ఆ దృశ్యాలను తన ఫోన్‌లో చిత్రీకరించి, తర్వాత వారిని బెదిరించేవాడు. తన రాసలీలలకు భార్య అడ్డుగా ఉంటుందని తరచూ ఆమెను పుట్టింటికి పంపించేవాడు.


దీంతో భర్త తీరుపై అనుమానం వచ్చిన మాధవి తన సోదరుడితో నిఘా పెట్టించింది. ఈ క్రమంలో ఆదివారం శ్రీకాంత్ వేరే అమ్మాయితో ఓ ప్రైవేటు గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని తుకారాంగేట్ పోలీసులకు పట్టిచ్చారు. పోలీసులు శ్రీకాంత్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని చూడగా అందులో చాలామంది అమ్మాయిలతో నగ్నంగా ఉన్న దృశ్యాలు వెలుగు చూశాయి. శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు