లక్కీడ్రాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చింది!

5 Mar, 2016 19:09 IST|Sakshi
లక్కీడ్రాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చింది!

బంజారాహిల్స్ : లక్కీడ్రాలో ఎంపిక అయ్యారని, మొబైల్ ఫోన్ పంపిస్తున్నామంటూ బురిడీ కొట్టించి అల్లం వెల్లుల్లి పేస్టును అంటగట్టిన ఉదంతం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్‌లోని అపోలో ఆస్పత్రి వద్ద ఆటో నడుపుతూ జీవనం సాగించే రాజు అనే యువకుడికి వారం క్రితం తెలియని నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. హిమాలయ హెర్బల్ ఆయుర్వేదిక్ కంపెనీ ప్రతినిధినంటూ ఓ వ్యక్తి అతనితో మాట్లాడాడు.

సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిర్వహించిన లక్కీడ్రాలో రాజు ఫోన్ నంబర్ సెలక్ట్ అయిందని, బహుమతిగా ఒక మొబైల్ ఫోన్ పంపుతున్నామని చెప్పాడు. అడ్రస్ అడిగి తీసుకున్నాడు. పార్శిల్ వచ్చిన తర్వాత రూ. 2625 చెల్లిస్తే సరిపోతుందని తెలిపాడు. శుక్రవారం నాడు రాజుకు పోస్టాఫీస్ నుంచి పార్శిల్ వచ్చింది. చెప్పినట్టే రూ.2625 చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు. దానిని ఓపెన్ చేసి చూడగా అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు పనికిరాని సామగ్రి కనిపించింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు