చెక్ బౌన్స్ కేసులో ప్రభుత్వ ఉద్యోగికి జైలుశిక్ష

26 Jan, 2016 18:01 IST|Sakshi

చెక్‌బౌన్స్ కేసులో ప్రభుత్వ ఉద్యోగిని చింతపల్లి ఝాన్సీకి విజయవాడ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు ఓ సంవత్సరం జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు స్పెషల్ మేజిస్ట్రేట్ టి.రమేష్‌బాబు ఇటీవల తీర్పు వెలువరించారు. తను ప్రభుత్వ ఉద్యోగినని, తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నానని, తనపై ఆధారపడిన కుమార్తె ఉన్నారని, అందువల్ల తనపై దయ చూపాలంటూ ఝాన్సీ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
ఝాన్సీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించాల్సిన కారణాలు ఏమీ కనిపించడం లేదని, ఆమెకు విధించిన రూ.5 లక్షల జరిమానాలో రూ.4.90 లక్షలను ఫిర్యాదుదారు పరిహారంగా పొందవచ్చునని రమేష్‌బాబు తన తీర్పులో పేర్కొన్నారు.

కాగా.. విజయవాడ, భవానీపురానికి చెందిన వి.ఎస్.సిహెచ్.శేఖర్ నుంచి గొల్లపూడి గ్రామానికి చెందిన ఝాన్సీ తన కుటుంబ అవసరాల నిమిత్తం 2009లో రూ.4.75 లక్షలను అప్పుగా తీసుకున్నారు. ఇందుకు ప్రామిసరీ నోటు కూడా ఇచ్చారు. అయితే అప్పు చెల్లించని నేపథ్యంలో శేఖర్ చేసిన విజ్ఞప్తి మేరకు అప్పులో కొంత భాగం చెల్లించేందుకు ఝాన్సీ 2012లో రెండు చెక్కులు ఇచ్చారు. బ్యాంకులో తగిన నిధులు లేవంటూ వాటిని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీంతో ఝాన్సీకి శేఖర్ లీగల్ నోటీసు పంపారు.

అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆయన కోర్టులో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం (ఎన్‌ఐ యాక్ట్) కింద కేసు దాఖలు చేశారు. దీనిపై స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. తన సంతకాలను స్కాన్ చేసి శేఖర్ తప్పుడు హామీ పత్రాలు సృష్టించారన్న ఝాన్సీ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. అవి తప్పుడు పత్రాలు కావని, ఝాన్సీ స్వయంగా సంతకం చేసిన ప్రామిసరీ నోటని కోర్టు తేల్చింది.

తాను సంతకం చేసిన ఖాళీ చెక్కులను,  ప్రామిసరీ నోటును ఎవరో దొంగతనం చేశారన్న ఝాన్సీ వాదనలను సైతం కోర్టు తిరస్కరించింది.  ఆమె చెబుతున్నవన్నీ అబద్ధమని తేల్చింది. అన్ని సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌ఐ యాక్ట్ ప్రకారం ఝాన్సీ నేరం రుజువైందని, అందువల్ల ఆమె శిక్షార్హురాలని కోర్టు తేల్చింది.  ఆమెకు జైలుశిక్ష, జరిమానా విధించింది.

మరిన్ని వార్తలు