గంజాయి స్మగ్లింగ్ ముఠాకు చెక్

27 Sep, 2013 02:52 IST|Sakshi

హయత్‌నగర్, న్యూస్‌లైన్: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. నలుగురి అరెస్టు చేసి రూ. 60 లక్షల విలువైన 10 క్వింటాళ్ల ‘సరుకు’తో పాటు డీసీఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును జల్సాలకు ఖర్చు చేయడంతో పాటు గత పంచాయితీ ఎన్నికల్లోను ఖర్చు చేశామని నిందితులు చెప్పడం గమనార్హం. ఎస్‌ఓటీ ఓఎస్‌డీ గోవర్దన్‌రెడ్డి గురువారం తెలిపిన వివరాల ప్రకారం...

ఒడిశాకు చెందిన పాల్ మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన గణేష్‌కు రెండేళ్లుగా గంజాయిని సరఫరా చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా తిప్పాయిగూడెంకు చెందిన డీసీఎం డ్రైవర్ వీరేష్‌గౌడ్‌తో పాల్‌కు వైజాగ్‌లో పరిచయమైంది. వీరేష్ తన వ్యాన్‌లో ఒడిశా నుంచి షిర్డీకి గంజాయిని తరలించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. తన గ్రామానికి చెందిన బుర్ర వెంకటేష్‌గౌడ్, మహ్మద్ జాని, బోయ రవిల సహకారంతో ‘సరుకు’ను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నాడు. పాల్ ఇతనికి ట్రిప్పుకు రూ. 50 వేలు కిరాయితో పాటు మరో రూ. లక్ష అదనంగా చెల్లిస్తున్నాడు. నెలకు రెండు లేదా మూడు ట్రిప్పులను వీరు తరలిస్తున్నారు. ఎస్‌ఓటీ పోలీసులకు ఈ సమాచారం అందడటంతో రెండు నెలలుగా వీరిపై దృష్టి పెట్టారు.
 
గురువారం ఉదయం 7 గంటలకు పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద మాటువేసి... డీసీఎం వ్యాన్ (ఏపీ24ఎక్స్4533)లో తరలిస్తున్న 10 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నారు. డ్రైవర్ వీరేష్‌గౌడ్‌తో పాటు వెంకటేశ్‌గౌడ్, జాని, రవిలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 సెల్‌ఫోన్లు, రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులు పాల్, గణేష్‌లు పరారీలో ఉన్నారని,  నిందితులపై మారక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఓఎస్‌డీ చెప్పారు. ఈ ముఠా గుట్టురట్టు చేసిన సిబ్బందికి రివార్డు ఇస్తామన్నారు. కాగా, గంజాయి స్మగ్లింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును జల్సాలకు ఖర్చు చేసినట్లు నిందితులు తెలిపారు. గత పంచాయితీ ఎన్నికల్లోనూ కొంతడబ్బును ఖర్చు చేశామని చెప్పారు.  
 

మరిన్ని వార్తలు