‘అసైన్డ్‌’ సమస్యకు ‘ప్రక్షాళన’తో పరిష్కారం!

14 Sep, 2017 02:01 IST|Sakshi
‘అసైన్డ్‌’ సమస్యకు ‘ప్రక్షాళన’తో పరిష్కారం!
భూ రికార్డుల ప్రక్షాళనలో అసైన్డ్‌ భూముల సమస్యకు చెక్‌
- అన్యాక్రాంతమైన భూముల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు
కబ్జాలో ఉన్న వారి ‘సామాజిక, ఆర్థిక హోదా’ వివరాలు చెప్పాలని ఉత్తర్వులు
నివేదికల ఆధారంగా రీ అసైన్‌ లేదా క్రమబద్ధీకరణ!
లక్షల ఎకరాలు పట్టాలయ్యే చాన్స్‌
దళితులైతే మూడెకరాల పంపిణీ కింద అందజేత
 
సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ వ్యవస్థలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మరో సమస్యకు భూ రికార్డుల ప్రక్షాళన పరిష్కారం చూపుతుందా.. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఈనెల 15 నుంచి జరగనున్న ఈ ప్రక్రియలో అసైన్డ్‌ భూముల సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టే దిశలో రెవెన్యూ యంత్రాంగం నిబంధనలు రూపొందించింది. అసైన్డ్‌ భూములు నిజమైన లబ్ధిదారుల చేతిలో ఉంటే మళ్లీ వారి పేరు మీద రికార్డుల్లో నమోదు చేసుకోవాలని, వేరొకరి కబ్జాలో ఉంటే తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘సామాజిక, ఆర్థిక హోదా’ అనే పదాన్ని భూ రికార్డుల ప్రక్షాళన కోసం రూపొందించిన మార్గదర్శకాల్లో చేర్చింది.
 
20 లక్షల ఎకరాల పైమాటే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైనప్పటి నుంచే భూమి లేని నిరుపేదలకు భూ పంపి ణీ చేశారు. వ్యవసాయ, నివాస భూముల ను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి అసైన్‌ చేసేవారు. తర్వాత రాజకీయ బాధి తులు, స్వాతంత్య్ర సమరయోధులకు భూములు అసైన్‌ చేశారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగానే అసైన్‌ చేసిన భూములు ఉంటాయని అంచనా. 
 
40 శాతం అన్యాక్రాంతం
అయితే ఈ అసైన్డ్‌ భూములను అమ్ముకునే అవకాశం లేదు. వేరొకరి పేరు మీద రిజిస్టర్‌ కూడా కావు. కానీ దాదాపు 40 శాతం పైగా అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతం అయ్యాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన భూములను లబ్ధిదారులు అమ్ముకోవడం.. లేదంటే వ్యవసాయ యోగ్యం కాక వదిలివేయడంతో వేరొకరు కబ్జా చేశారని, ఇలా రాష్ట్రంలో 8 లక్షల వరకు అసైన్డ్‌ భూములు ఇతరుల చేతుల్లో ఉన్నాయని అంటున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కూడా ఓ నివేదిక ఇచ్చింది. అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమైతే వాటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని చట్టాలు చెబుతున్న నేపథ్యంలో.. 15 నుంచి ప్రారంభం కానున్న భూ రికార్డుల ప్రక్షాళనలో అసైన్డ్‌ భూముల వాస్తవ పరిస్థితి తేలనుంది.

అన్యాక్రాంత అసైన్డ్‌ భూములను ఏకపక్షంగా తిరిగి తీసుకునే దానికంటే కబ్జాలో ఉన్న వారి జీవన పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసైన్డ్‌ భూముల కబ్జాలో ఉన్న వారి సామాజిక ఆర్థిక హోదా వివరాలు పేర్కొంటూ ప్రత్యేక నివేదిక పంపాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
 
ప్రక్షాళనకు వెళ్లినప్పుడు ఏం చేస్తారంటే?
రికార్డుల ప్రక్షాళనకు వెళ్లినప్పుడు ప్రభుత్వం అసైన్‌ చేసిన భూముల్లో నిజమైన లబ్ధిదారులే ఉంటే అక్కడే వారికి 1–బీ రిజిస్టర్‌ ప్రతిని అందజేస్తారు. పాసు పుస్తకాలు లేని వారుంటే వివరాలు నమోదు చేసుకుంటారు. ఒకవేళ లబ్ధిదారు కాకుండా వేరొకరు కబ్జాలో ఉంటే వారి సామాజిక, ఆర్థిక హోదాను తెలి యజేస్తూ నివేదిక పంపాలని కలెక్టర్లకు పంపిన మార్గదర్శకాల్లో సీఎస్‌ ఎస్పీ సింగ్‌ స్పష్టంగా పేర్కొన్నారు. కబ్జాలో ఉన్న వారి పేరు, విస్తీర్ణం, వ్యవసాయ యోగ్యమా కాదా, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏంటి, కులం తదితర వివరాలను పేర్కొనాలని సూచించారు. ఈ వివరాలు తెలుసుకోవడం ద్వారా కబ్జాలో ఉన్నది నిజంగా పేదలైతే వారికే రీ అసైన్‌ లేదా నామమాత్రపు ధర మీద క్రమబద్ధీకరించే ఆలోచనతోనే ఈ నిబంధన చేర్చామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇక కులం తెలుసుకోవడం ద్వారా కబ్జాలో ఉన్నది దళితులైతే వారికి మూడెకరాల భూ పంపిణీ కింద నేరుగా పట్టాలిచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొంటున్నాయి. 
మరిన్ని వార్తలు