బాబుకు డాక్టరేట్ ఇవ్వకుండానే..

2 Mar, 2016 13:30 IST|Sakshi
బాబుకు డాక్టరేట్ ఇవ్వకుండానే..

షికాగో స్టేట్ వర్సిటీ మూసివేత

సాక్షి, హైదరాబాద్: షికాగో స్టేట్ యూనివర్సిటీ (సీఎస్‌యూ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డాక్టరేట్ ప్రదానం చేయకుండానే మూతపడింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో వర్సిటీని మూసివేస్తున్నట్టు సీఎస్‌యూ అధ్యక్షుడు డాక్టర్ థామస్ కల్హన్ ప్రకటించారు. చంద్రబాబుకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు సీఎస్‌యూ ప్రతినిధులు గత డిసెంబర్ 18న వెల్లడించారు.

వాస్తవానికి అమెరికాలో షికాగో యూనివర్సిటీ అని ఒకటి, చికాగో స్టేట్ యూనివర్సిటీ అని మరొకటి ఉన్నాయి. షికాగో యూనివర్సిటీకి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. షికాగో స్టేట్ యూనివర్సిటీనే షికాగో వర్సిటీగా భావించిన చంద్రబాబు ఉప్పొంగిపోయారు. కానీ తర్వాత అసలు విషయం తెలిసింది. చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తానన్నది షికాగో స్టేట్ యూనివర్సిటీ అని. ఇది 1867లో ఒక చిన్న స్కూలుగా ప్రారంభమై క్రమేణా విశ్వవిద్యాలయ స్థాయికి చేరింది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహిస్తున్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోటీలో లేకపోవడంతో ఈ యూనివర్సిటీ ప్రమాణస్థాయి వేయికిపైగా ర్యాంకుకు దిగజారింది. దాంతో అటు అమెరికా ప్రభుత్వం కానీ ఇటు ఇల్లినాస్ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు ఇవ్వడం లేదు. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇవేమీ తెలియకుండానే చంద్రబాబు.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ తన పనితీరు మెచ్చి డాక్టరేట్ ప్రదానం చేయడానికి ముందుకొచ్చిందంటూ అప్పట్లో బడాయికి పోయారు.
 

మరిన్ని వార్తలు