కోడి.. కొనలేం..!

8 Jun, 2015 02:33 IST|Sakshi
కోడి.. కొనలేం..!

చికెన్ ధరలకు రెక్కలు
స్కిన్‌లెస్ కేజీ రూ.222.. బోన్‌లెస్ రూ.400
బర్డ్‌ఫ్లూ కారణంగా భారీగా తగ్గిన కోళ్ల ఉత్పత్తి

సాక్షి, హైదరాబాద్: వారంలో రెండు రోజులైనా చికెన్‌ముక్క లేకుంటే అన్నం ముద్ద గొంతుదిగదు చాలామందికి. వీరందరికీ ఎంతో ఇష్టంగా చికెన్ తినాలని ఉన్నా.. కష్టంగానైనా కొనలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులుగా చికెన్ ధరలు కొండెక్కడమే దీనికి కారణం.

బర్డ్‌ఫ్లూ భయంతో ఇటీవల కాస్త దిగివచ్చిన చికెన్ ధర మళ్లీ ఆకాశానికి ఎగబాకింది. ఆదివారం నగర మార్కెట్‌లో చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.222కు, స్కిన్‌తో రూ.188కి, బోన్‌లెస్ అయితే రూ.400కు విక్రయించారు. ఏప్రిల్/మే నెలల్లో బర్డ్‌ఫ్లూ కారణంగా పౌల్ట్రీ యజమానులు స్వచ్ఛందంగా కోళ్లను చంపేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్త బ్యాచ్‌లు వే సేందుకు తటపటాయించడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు చికెన్ ధరలపై పడింది. దీనికితోడు పెళ్లిళ్లు, ఫంక్షన్లు రావడంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది.

ఇదే అదనుగా చికెన్ వ్యాపారులు ధర పెంచేశారు. నిజానికి ఫారం రైతు కిలో కోడిని రూ.111లకే అమ్ముతున్నా.. రిటైల్ మార్కెట్‌లో చికెన్ రెట్టింపు ధర పలుకుతోంది. వారానికి ఒక్కసారైనా కోడి కూర రుచి చూద్దామనుకునే మాంసప్రియులకు పెరిగిన ధర నిరాశ కల్గిస్తోంది. మరోవైపు బడా చికెన్ సెంటర్లు రేట్లు పెంచేయడం వల్ల తమకు గిరాకీ తగ్గిందంటూ చిల్లర వ్యాపారులు వాపోతున్నారు.

గత వారం 5 క్వింటాళ్ల(300 కోళ్లకుపైగా) చికెన్ విక్రయించిన తాను ఈ ఆదివారం 2 క్వింటాళ్లే (100 కోళ్లనే) అమ్ముడుపోయిందని ఉప్పల్‌లోని జ్యోతి చికెన్ సెంటర్ నిర్వాహకుడు కొండల్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్టు కోళ్ల ఉత్పత్తి లేదని, సరఫరా తగ్గడంతో డిమాండ్ పెరిగి వ్యాపారులు ఇష్టారీతిన ధర పెంచేస్తున్నారని, కొత్త బ్యాచ్ కోళ్లు వచ్చే వరకూ చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
 
చేపలకు భలే గిరాకీ...!
ప్రతి ఏటా మృగ శిరకార్తె రోజు చేపలు తినడం చాలామందికి ఆనవాయితీ. సోమవారం మృగశిరకార్తె ఉండడంతో ఆదివారం చేపల దుకాణాలు కళకళలాడాయి. బేగం బజార్‌లోని చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. హోల్‌సేల్ మార్కెట్‌లోనూ, రోడ్లపై విక్రయించేవారు రేట్లు పెంచి అమ్మారు. గతంలో కిలో రూ.300 ఉన్న కొర్రమీను(కొర్రమట్ట) చేపలు ఆదివారం రూ.400-450కు విక్రయించారు. నాంపల్లి మార్కెట్, ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, కోఠి, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో కొర్రమీను చేపలను కిలో రూ.400 నుంచి 600 వరకూ అమ్మడం గమనార్హం.

మరిన్ని వార్తలు