చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలి

19 Mar, 2016 10:12 IST|Sakshi
చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలి

అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ మార్షల్ ఇద్దరూ త్వరలోనే జైలుకు వెళ్లి చిప్పకూడు తినేందుకు సిద్ధంగా ఉండాలని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్‌లో సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు వాళ్లిద్దరికీ ఈ శిక్ష తప్పదని తెలిపారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు అమలుచేయాల్సిన అవసరం లేదని వీళ్లు అనుకుంటున్నారని, తమ తీర్పులే అంతిమం అని భావిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా వస్తే గౌరవిస్తారు, లేకపోతే లేదా అన్నారు. ప్రాథమిక హక్కులు, మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా సభా వ్యవహారాలు జరిగినప్పుడే 212 అధికరణ పనిచేస్తుందని, అలా కాకుండా జరిగితే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ముందే చెప్పారన్నారు. యూపీలో 1964లో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేను 7 రోజులు అరెస్టు చేస్తే లక్నో కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని, డివిజన్ బెంచి కూడా సింగిల్ బెంచి తీర్పును సమర్థించిందని తెలిపారు. రాష్ట్రపతి న్యాయసలహా కోరితే సుప్రీంకోర్టు కూడా వ్యక్తి హక్కులకు భంగం కలిగించకూడదనే చెప్పిందని గుర్తు చేశారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా స్పీకర్ల నిర్ణయాన్ని కోర్టులు తప్పుబట్టాయని తెలిపారు. కోర్టు తీర్పు ఇచ్చాక దాన్ని అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెవిరెడ్డి భాస్కర రెడ్డి స్పష్టం చేశారు. మైకిస్తే తమ అభిప్రాయం చెప్పగలమని, ప్రతిపక్ష నాయకుడు లేచి అధ్యక్షా అంటుంటే ఐదుగురు టీడీపీ సభ్యులు మాట్లాడారు గానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదని..
కనీసం చెవికెక్కించుకోడానికి అధికార పక్షం సిద్ధంగా లేకపోతే తాము ఏ విధంగా చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు.

ఇక తెలుగుదేశం ప్రభుత్వానికి అధికార అహంకారం తలకెక్కిందని మరో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. కనీసం మహిళా శాసనసభ్యులన్న గౌరవం కూడా వాళ్లకు లేదని మండిపడ్డారు. కేవలం రోజా మీద, వైఎస్ఆర్‌సీపీ మీద వ్యక్తిగత కక్ష పెంచుకున్న ఎమ్మెల్యేలు, సీఎం ఏడాదిపాటు ఆమెను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని, ఇది మొదటి తప్పు అని చెప్పారు. తాము ఎంతో గౌరవంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, హైకోర్టులో జాప్యం జరుగుతుంటే సుప్రీంకోర్టుకు వెళ్లామని.. సాక్షాత్తు సుప్రీం ధర్మాసనం ''ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, మేం ఆందోళన చెందుతున్నాం'' అని వ్యాఖ్యానించిందంటే వీళ్లు సిగ్గుతో తలదించుకోవాలని, ఇది రెండో తప్పని చెప్పారు.

తర్వాత సుప్రీం ఆదేశాల మేరకు ఒక్కరోజులో విచారణ పూర్తిచేసిన హైకోర్టు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని ఉత్తర్వులచ్చిందని, ఆ ఉత్తర్వులతో ఎమ్మెల్యే సభకు వస్తే, కోర్టు ఉత్తర్వులను కూడా అవమానించారని, ఇది న్యాయస్థానానికి జరిగిన అవమానమని చెప్పారు. ఇంతమంది ఎమ్మెల్యేలు కలిసి రాజ్యాంగాన్ని గౌరవించాలని, మహిళలను గౌరవించాలని కోరుతూ ధర్నా చేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని శివప్రసాదరెడ్డి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై తమకు గౌరవం ఉందని, మాకు లేదని ఎద్దేవా చేశారని, సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా మీకు జ్ఞానోదయం కలగదా అని ఆయన ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు మీరు సాధించిందేంటి అని నిలదీశారు. రోజా సంధించే ప్రశ్నలకు సమాధానంచెప్పలేక భయపడుతున్నారా అని అడిగారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపప్పటి నుంచి ఇదే అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలుచేయాలన్న చిత్తశుద్ధి లేదని, వాళ్ల కార్యకర్తలు.. నాయకులను కాపాడుకోవడం, విచ్చలవిడిగా దోచుకోవడమే సరిపోతోందని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు