మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?

16 Jun, 2016 01:29 IST|Sakshi
మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా?
  • కాంగ్రెస్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు
  • నాడు మా 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకోలేదా?
  • రాష్ట్రం వ చ్చాక కూడా కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేశాయి
  • బెర్లిన్ గోడ బద్దలైనట్టు మళ్లీ రెండు రాష్ట్రాలు కలుస్తాయన్నాడు చంద్రబాబు..
  • ఈ ప్రభుత్వం ఎల్లుండే పడిపోతుందన్నడు భట్టి
  • తెలంగాణకు నీళ్లు వద్దన్న తెలుగుదేశం పార్టీతో
  • కాంగ్రెస్ జతకట్టడం ఏం నీతో జానారెడ్డి చెప్పాలి
  •  రాష్ట్రం రాజకీ య, ఆర్థిక సుస్థిరత సాధించాలి..
  • తెలంగాణకు టీఆర్‌ఎస్సే రక్షణ కవచం
  • మేం పిలవడం లేదు.. అభివృద్ధిని చూసి వారే వస్తున్నారు
  •  టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, కాంగ్రెస్ నేతలు వివేక్, వినోద్
  •  

    సాక్షి, హైదరాబాద్: ‘‘నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమం కోసం గెలిచిన 26 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో 10 మందిని చేర్చుకున్నారు. ఆనాడు లేని నీతి ఇప్పుడెలా గుర్తుకొచ్చింది? సరిగ్గా ఎన్నికల ముందు మా ఎంపీ విజయశాంతిని, ఎమ్మెల్యే అరవిందరెడ్డిని చేర్చుకోలేదా..? మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా..?’’ అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రం రాజకీయ, ఆర్థిక సుస్థిరత సాధించాలని, తెలంగాణకు రక్షణ కవచం టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టంచేశారు. బుధవారం కాంగ్రెస్‌కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, దేవరకొండ నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ గుత్తా మాత్రం టీఆర్‌ఎస్ కండువా కప్పుకోలేదు. కాంగ్రెస్ నుంచి ఒక జెడ్పీ వైస్ చైర్మన్, ముగ్గురు ఎంపీపీలు, ఆరుగురు జెడ్పీటీసీ సభ్యులు, ఒక మున్సిపల్ చైర్‌పర్సన్, ఐదుగురు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ నేతల తీరును తూర్పారబట్టారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

    నేను బతికా.. ప్రజలు ఆనందపడ్డరు..
    రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 14ఎఫ్ మార్పిడికి నిరసనగా ఆమరణ దీక్షకు దిగా. కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది. దీక్ష సమయంలో నేను చావాల్సింది.. కానీ చావలేదు. ప్రజలు ఆనందపడ్డరు. అంతకుముందు ఎన్నోసార్లు తెలంగాణ కోసం మేం మూకుమ్మడి రాజీనామాలు చేసి పోటీకి వెళ్తే మాపై పోటీకి వచ్చారు. కానీ ప్రజలు మమ్ముల్నే గెలిపించారు. రాష్ట్రం వచ్చాక కూడా అనేక చర్యలకు పాల్పడ్డరు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే 63 సీట్లలో గెలిచినం. మరో 14 సీట్లలో వెయ్యిలోపు ఓట్ల తేడాతో ఓడిపోయినం.

     

    బాబు మామూలు కుట్రలు చేయలే..
    తెలంగాణ  ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మామూలు కుట్రలు చేయలేదు. బెర్లిన్ గోడ బద్దలై జర్మనీ ప్రజలు కలసిపోయినట్లు ఏపీ, తెలంగాణ మళ్లీ కలసిపోతయని మాట్లాడిండు. కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అయితే.. ఎల్లుండే ప్రభుత్వం పడిపోతదన్నడు. నేను సీఎంగా బాధ్యతలు తీసుకోక ముందే కుట్రలు చేసిండ్రు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నాకు ఫోన్ చేసి ఇంటికొచ్చిండు. టీడీపీ, కాంగ్రెస్ ఏకమై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడకుండా కుట్రలు చేస్తున్నయని చెప్పిండు. రాష్ట్రపతి పాలన తెచ్చే కుట్రలు చేస్తున్నరని చెప్పిండు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదేందన్నడు. టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తామని తెల్లారే ప్రకటించిండు. కాంగ్రెస్, టీడీపీ నేతల లక్ష్యం ఒక్కటే.. తెలంగాణ రాష్ర్టం ఏర్పడొద్దు. ఏర్పడితే బతకొద్దు. జానారెడ్డి రాష్ట్రం భ్రష్టు పడుతోందని అంటున్నడు. కాదు కాదు.. కాంగ్రెస్ భ్రష్టు పడుతోంది.

     కేసీఆర్‌కు ఒక్కటే నీతి.. తెలంగాణ రాష్ట్రం తన శక్తి మీద తాను నిలబడాలి. రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించాలి. సమైక్యవాదుల కుట్రలకు బలికావొద్దు. బలంగా ఉండాలి. తెలంగాణకు రక్షణ కవచం టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే. 2019 కంటే ముందే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు అంటడు. చంద్రబాబూ.. ప్రభుత్వం కూలిపోతుందని అనడం ఏం నీతి? అది సక్రమమైన ఆలోచనా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఉండగానే అట్లెట్ల అంటడు? తెలంగాణకు నీళ్లు వద్దంటడు. పాలేరు ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ జతకట్టడం ఏ రకమైన నీతో జానారెడ్డి చెప్పాలి. అచ్చంపేట ఎన్నికల్లో అందరూ కలసి కూటమి కడతరు. ఇదేం నీతి? మీరు చేస్తే నీతి.. మేం చేస్తే అవినీతా?

     

    అభివృద్ధిని చూసే వస్తున్నారు..
    టీఆర్‌ఎస్‌లోకి వలస వస్తున్న వారిని మేం పిలవడం లేదు. జరుగుతున్న అభివృద్ధిని చూసి వస్తున్నరు. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కావు. వీటిని అలా చూడటం లేదు. చాలా మందికి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సొంత నిర్ణయంతో వచ్చారు. మేం రమ్మన లేదు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు కూడా ఏడాదిన్నరగా మాతో టచ్‌లో ఉన్నారు. అమ్ముడుపోయారని, కేసీఆర్ కొన్నాడని అంటున్నారు. మాజీ ఎంపీ వివేక్ కేవలం తన తండ్రి కోరిక మేరకే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. వెళ్లే ముందు నాకు చెప్పి వెళ్లారు.

    మీ పాలనలో మంచి పనులు జరుగుతున్నాయి. కలసి పనిచేస్తానని, మళ్లీ పార్టీలోకి వస్తానన్నారు. సుఖేందర్‌రెడ్డి, నేనూ ఆప్త మిత్రులం. 1996లోనే శ్రీరాంసాగర్ డ్యామ్‌పై కూర్చుని తెలంగాణ గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆంధ్రా ప్రాంతానికి నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ వైష్ణవాలయంలా ఉంటే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు శివాలయంలా ఉందన్న. ఏపీలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు న్యాయం జరగద ని ఆ రోజే చెప్పిన. 2001లో నేనే ఉద్యమం మొదలు పెట్టా. తెలంగాణది వందేళ్ల దుఃఖం. సమైక్య రాష్ట్రంలో చేరి కష్టాలు పడ్డాం. ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి మేలు చేస్తాం. పేదరికాన్ని రూపుమాపుతం. 2019లోగానే కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తం.

     

     సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌కు గడువు పొడిగింపు
    ఈ సమావేశానికి వచ్చే ముందే సీసీఎల్‌ఎతో మాట్లాడా. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లకు డిమాండ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సాదా బైనామాలకు సంబంధించి 6 లక్షల మంది ఆర్వోఆర్ పట్టాలు పొందారు. మరో వారం రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తున్నాం. చరిత్రలో ఎవరూ ఈ ఆలోచన చేయలేదు. దీంతోపాటు హైదరాబాద్‌లో పేదలకు ఇప్పటికే లక్ష మందికి పట్టాలిచ్చాం. తెలంగాణ సమాజాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం. నేను మళ్లీ చెబుతున్నా.. టీఆర్‌ఎస్‌కు ప్రజలే బాసులు. సొల్లు కబుర్లు వద్దు. నిర్మాణాత్మక సలహాలివ్వండి. కేసీఆర్‌ను తిడితే ఏం జరగదు. 2019లోనూ గెలిచేది కూడా టీఆర్‌ఎస్సే.

మరిన్ని వార్తలు