టెక్నాలజీతో చెంతకు చేర్చుతారట!

13 Aug, 2016 20:25 IST|Sakshi

హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు వెళ్తున్నారా? మీ వెంట పిల్లలు, వృద్ధులను తీసుకెళ్తున్నారా? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భక్తజన రద్దీలో వీరు తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇలా తప్పిపోయిన వారిని వారి కుటుంబీకుల దగ్గరికి చేర్చేందుకు పుష్కర పర్యవేక్షణాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకు వలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ‘ కృష్ణా పుష్కరాలు చైల్డ్ ట్రాకింగ్’ అనే యాప్ ద్వారా సేవలందిస్తున్నారు.

ఈ యాప్ వివరాలు మీకోసం.. వివరాల నమోదు..పుష్కర ఘాట్ల వద్ద ఉన్న హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించి మీ ఫోన్‌లోని ‘కృష్ణా పుష్కరాలు చైల్డ్ ట్రాకింగ్’ యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. యాప్ ఓపెన్ చేయగానే పిల్లలు, వృద్ధులు అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని గార్డియన్, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి. అనంతరం అక్కడి హెల్ప్‌డెస్క్ సిబ్బంది పిల్లలు/వృద్ధుల చేతికి ఒక రిస్ట్ వాచ్ బ్యాండ్ వేస్తారు. ఇది తడవదు, చినగదు. ఒకవేళ మీ దగ్గర యాప్ లేకపోయినా పర్వాలేదు. నేరుగా హెల్ప్‌డెస్క్‌కు వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవచ్చు.

అప్పగిస్తారిలా..
తప్పిపోయిన పిల్లలు/వృద్ధులను పుష్కర ఘాట్లలో పనిచేస్తున్న వలంటీర్లు వాకబు చేస్తారు. వారి చేతికున్న బ్యాండ్ సహాయంతో గార్డియన్ వివరాలు సేకరిస్తారు. సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి సందేశం ఇస్తారు. ఒకవేళ ఫోన్ పోతే అడ్రస్ ఆధారంగా వారిని కుటుంబీకులకు అప్పగిస్తారు.

మరిన్ని వార్తలు