బాలుడ్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన చైల్డ్‌లైన్ సంస్ధ

30 Aug, 2016 20:44 IST|Sakshi

 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై తిరుగుతున్న బాలుడిని చేరదీసి పోలీసులు సమక్షంలో తల్లితండ్రులు చెంతకు చేర్చిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, చైల్డ్‌లైన్ సంస్ధ ప్రతినిధి సుమలత తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌నగర్‌కు చెందిన కే.సాయిమణికంఠరెడ్డి మెట్టుగూడలోని బంధువుల ఇంట్లో ఉంటూ స్థానిక ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. స్కూలుకు వెళ్లడం ఇష్టంలేని సాయిమణికంఠ ఈనెల 28వ తేదిన ఇంటి నుంచి పారిపోయాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై తిరుగుతున్న బాలుడిని చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు గుర్తించి చేరదీశారు. ఈనెల 30వ తేదిన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన బాలుడి అదృశ్యం కథనాన్ని చూసిన చైల్డ్‌లైన్ నిర్వాహకులు బాలుడు తమ వద్దే ఉన్నాడని చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎస్‌ఐ బీ శ్రీనివాసులు సమక్షంలో సాయిమణికంఠరెడ్డిని తల్లితండ్రులు అచ్చిరెడ్డి, సునీతలకు అప్పగించారు. బాలుడిని చేరదీసిన చైల్డ్‌లైన్ ప్రతినిధులు, పోలీసులతోపాటు ‘సాక్షి’ యాజమాన్యానికి బాలుని తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు