చిలుకూరు బాలాజీకి ఉత్సవ శోభ

2 Apr, 2017 11:15 IST|Sakshi

మొయినాబాద్‌: వీసా దేవుడిగా పిలుచుకునే చిలుకూరు బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. యేటా ఉగాది పండుగ అనంతరం చైత్ర శుక్ల దశమి నాడు ప్రారంభమై చైత్ర బహుళ విధియ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కొనసాగడం ఆనవాయితీ. ఈ నెల 6న ఉదయం సెల్వర్‌కుత్తుతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది.

7న ధ్వజారోహణం, సాయంత్రం శేష వాహనం, 8న ఉదయం గోప వాహనము, సాయంత్రం హనుమంత వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. 9న ఉదయం సూర్య ప్రభ, సాయంత్రం గరుడ వాహనం, రాత్రికి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీదేవి, భూదేవి, బాలాజీల కల్యాణోత్సవం ఉంటుంది. 10న వసంతోత్సవం, గజ వాహనంపై ఊరేగింపు, 11న పల్లకి సేవ, రాత్రికి రథోత్సవం జరుగుతుంది. 12న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వ వాహనము, దోప్‌ సేవ, పుష్పాంజలి, 13న బాలాజీ బ్రహ్మోత్సవాల చివరి రోజున ధ్వజారోహణం, ద్వాదశారాధనము, చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. మెహిదీపట్నం, లక్డీకపూల్‌, రాణిగంజ్‌, శేర్లింగంపల్లి, కూకట్‌పల్లి, మియాపూర్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, తార్నాక, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌, అఫ్జల్‌గంజ్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల మీదుగా సర్వీసులు నడుస్తాయి.

మరిన్ని వార్తలు