చలో దుబాయ్‌ అంటున్న భారతీయులు!

11 Feb, 2018 03:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పుణ్యం పురుషార్థం రెండూ కలిసొస్తాయని దగ్గర్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఒకప్పటి ఫ్యాషన్‌. ఇప్పుడు మాత్రం మన భారతీయులు చలో దుబాయ్‌ అంటున్నారు. కచ్చితంగా చెప్పాలంటే.. ఒక్క 2017లోనే దాదాపు 21 లక్షల మంది సరదాగా దుబాయ్‌ వెళ్లి వచ్చారు. ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను మార్చేందుకు తమ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని అక్కడి టూరిజం డైరెక్టర్‌ జనరల్‌ హెలాల్‌ సయీద్‌ అల్‌మరీ అంటున్నారు.

ఇందులో భాగంగా తాము బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూక్‌ ఖాన్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడం.. బీ మై గెస్ట్‌ వంటి వినూత్నమైన, పర్యాటక అనుకూల కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఫలితంగా ఏటికేడాదీ దుబాయ్‌ సందర్శించే వారి సంఖ్య పెరుగుతోందని 2020 నాటికల్లా రెండు కోట్ల మంది విదేశీ పర్యాటకులకు స్వాగతం చెప్పాలన్నది తమ లక్ష్యమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎప్పటికప్పుడు వినూత్న పర్యాటక ఆకర్షక ప్రాజెక్టులు చేపట్టడం వల్లే తాము ప్రపంచంలోనే అత్యంత ఆకర్షక పర్యాటక ప్రదేశాల జాబితాలో నాలుగో స్థానంలోకి చేరామన్నారు. త్వరలోనే నంబర్‌ వన్‌ స్థానానికీ చేరగలమని భావిస్తున్నట్లు వివరించారు. దుబాయ్‌ను ఎక్కువగా సందర్శించే వారి జాబితాలో భారత్‌ తరువాతి స్థానం సౌదీ అరేబియాది కాగా.. మూడో స్థానంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఉంది. చైనా, రష్యాలు ఐదు, ఎనిమిదో స్థానాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు