క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌

27 Jul, 2016 23:38 IST|Sakshi

నాచారం: నాచారం స్నేహపురి కాలనీ వద్ద గల వాటర్‌ ట్యాంకులో బుధవారం సాయంత్రం జలమండలి క్వాలిటీ అనాలిసిస్‌ సిబ్బంది క్లోరిన్‌ చేస్తుండగా గ్యాస్‌ లీకైంది.  ఇది చుట్టు పక్కలకు వ్యాపించింది. సిబ్బంది పరుగులు తీశారు. అక్కడే విధుల్లో ఉన్న నాచారం పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ రాజేష్‌ విషయం తెలుసుకుని ఆపడానికి ప్రయత్నించి తీవ్ర అస్వస్థతకు గుర య్యాడు. తీవ్ర ఘాటువాసన రావడంతో స్థానికులు... సమీపంలోని మీ సేవ సిబ్బంది పరుగులు తీశారు.

 

అస్వస్థతకు గురైన కానిస్టేబుల్‌ రాజేష్‌ను బాపూజీ నర్సింగ్‌ హోంకు తరలించారు. కుమార్‌ అనే వ్యక్తి వాంతులు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జలమండలి ఏఈ ఉమాపతి, నాచారం అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజన్‌తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఏఈ ఉమాపతి మాట్లాడుతూ తమకు తెలియకుండా క్వాలిటీ అనాలిసిస్‌ సిబ్బంది వచ్చారని తెలిపారు. క్లోరిన్‌ గ్యాస్‌ను నీటిలో కలుపుతారని... అది ప్రమాదకరమైంది కాదని వివరించారు.

 

విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన కానిస్టేబుల్‌ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సాయిజెన్‌ శేఖర్, పోతగాని గోపాల్‌ గౌడ్, వై. సత్యనారాయణ, అనుముల అశ్వత్థామరెడ్డి, మేడల మల్లిఖార్జున్‌ గౌడ్, గుండు రమేష్‌ గౌడ్, మహేష్‌ ఉన్నారు. ఆరు నెలలుగా మూత: గత ఆరు నెలలుగా నాచారం స్నేహపురికాలనీ వాటర్‌ ట్యాంక్‌లో నీరు లేక మూత పడి ఉంది. దీనిలో క్లోరినేషన్‌ చేస్తుండగా గ్యాస్‌లీకై ప్రమాదం సంభవించింది.

మరిన్ని వార్తలు