‘గ్రేటర్’లో కలరా కలవరం

14 Jul, 2016 00:37 IST|Sakshi
‘గ్రేటర్’లో కలరా కలవరం

- చాపకింద నీరులా విస్తరిస్తున్న విష జ్వరాలు
- బస్తీల్లో పారిశుద్ధ్యలోపం,కలుషిత నీరు సరఫరా
- వ్యక్తిగత శుభ్రతతోనే వ్యాధులు దూరం అంటున్న నిపుణులు
 
 సాక్షి, హైదరాబాద్ : నగరంలో పోలియో వైరస్ సృష్టించిన కలకలం ఇంకా మరవక ముందే తాజాగా వెలుగు చూసిన కలరా బస్తీవాసులను కలవరపెడుతోంది. కలుషిత నీరు, నిల్వ ఉన్న ఆహారంతో పాటు పారిశుద్ధ్యలోపం మలేరి యా, డెంగీ వంటి వ్యాధులకు కారణమవుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లా పరిధిలో 24 కలరా, 68 మలేరియా, 60 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ముషీరాబాద్‌లోని బాపూజీనగర్, అడ్డగుట్ట, అబిడ్స్ పరిసరాల్లో కలరా కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బొగ్గులకుంటలోని ఫెర్నాండేజ్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు నర్సులు మంగళవారం అబిడ్స్ సమీపంలో పండ్ల రసం తాగి తీవ్ర అస్వస్థతకు గురవ్వగా, వీరు విబ్రియో కలరా బారిన పడినట్లు తేలింది. ప్రస్తుతం వీరి ఆరోగ్యపరిస్థితి నిలకడ గా ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

 నీళ్ల విరేచనాలు...
 60 ఏళ్ల క్రితమే మాయమైపోయిందనుకున్న కలరా గ్రేటర్‌లో మళ్లీ కలకలం సృష్టిస్తోంది. కలరాలో ‘క్లాసికల్’బ్యాక్టీరియా కలరా చాలా ప్రమాదకరమైంది. ఇప్పటివరకు ఇది నగరం లో నమోదు కాలేదు కానీ,‘ఎల్టార్ విబ్రోయో ఒగావా కలరా’ అప్పుడప్పుడు వెలుగు చూ స్తూనే ఉంది. డయేరియా వస్తే రోజులో 10-15 సార్లు వాంతులు, విరేచనాలు అవుతా యి. కడుపు నొప్పి,  దాహం, నోరు ఎండిపోవ డం, చర్మం ముడతలు పడటం వంటి సమస్య లు ఉంటాయి. మూత్ర విసర్జన ఆగిపోతోంది. విరేచనాలు ఆరంభమైన కొద్ది సేపట్లోనే బియ్యం కడిగిన నీళ్లలా విరేచనాలు అవుతుంటే దీన్ని కలరాగా అనుమానించాలి. మంచినీటి నల్లాలా ఆగకుండా విరేచనాలతో పాటు వాసన ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. కలరా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
 
 ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి
 ► ఒకటే వాంతులు, దుర్వాసనతో కూడిన పలుచని విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే కలరాగా అనుమానించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
 ► బాధితుల వాంతులు, విరేచనాల ద్వారా ఇతరులకు ఇది వ్యాపించే అవకాశం ఉంది.
 ► పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి.
 ► తాజాగా ఇంట్లో వండిన వేడివేడి ఆహారం మాత్రమే తీసుకోవాలి.
 - డాక్టర్ లాలూ ప్రసాద్,నిలోఫర్ ఆస్పత్రి

మరిన్ని వార్తలు