నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి

5 May, 2017 01:46 IST|Sakshi
నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి

దాసరి పుట్టిన రోజు వేడుకల్లో సినీ ప్రముఖులు
దర్శకరత్నకు అల్లు రామలింగయ్య అవార్డు ప్రదానం

సాక్షి, హైదరాబాద్‌: దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజు వేడుకలు గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఉదయం పలువురు చలన చిత్రరంగ ప్రముఖులు దాసరి స్వగృహానికి వెళ్లి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్పత్రిలో చేరి, చికిత్స అనంతరం ఇంటి పట్టున విశ్రాంతిలో ఉంటున్న దాసరి కోలుకున్నట్లు కనిపించడం అందర్నీ ఆనందపరిచింది. అతిథులు, కుటుంబ సభ్యుల మధ్య ఆయన కేక్‌ కట్‌ చేశారు. సాయంత్రం దాసరి ఇంటికి చిరంజీవి, అల్లు అరవింద్‌ వెళ్లారు. అల్లు రామలింగయ్య అవార్డును ఆయనకు అందజేశారు. చిరంజీవి మాట్లాడుతూ, ‘‘దాసరిగారు ఆస్పత్రిలో ఉన్నప్పుడు నా ఖైదీ నంబర్‌ 150 గురించి అడిగి తెలుసుకోవడం ఆనందాన్నిచ్చింది.

ఈ సినిమా విజయోత్సవంలో పాల్గొంటానని ఆయన చెప్పడం మరచిపోలేను. దాసరిగారు చిత్రపరిశ్రమకు వెన్నెముకలా ఉంటూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ,  ‘‘గురువు (దాసరి) గారికి అల్లు రామలింగయ్య అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది. అల్లు రామలింగయ్యగారితో కొన్ని సినిమాలు చేశాను. ఆ కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. గురువుగారు కోలుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన వందేళ్లు ఆనందంగా ఉండాలి’’ అన్నారు. ‘‘దాసరిగారి ఆరోగ్య కారణాల దృష్ట్యా అవార్డును వేదికపై ఇవ్వడానికి కుదర్లేదు. పుట్టినరోజు నాడు చిరంజీవి గారి చేతుల మీదుగా ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు అల్లు అరవింద్‌. దాదాపు మూడు నెలల తర్వాత అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉందని దాసరి ఈ సందర్భంగా అన్నారు.

మరిన్ని వార్తలు