సిట్‌కు చట్టబద్ధత.. స్టేషన్ హోదా!

20 Sep, 2016 03:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్‌కు మరిన్ని అధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సిట్‌కు స్టేషన్ హోదా కల్పించడంతోపాటు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. దీంతో కేసులను సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావొచ్చని భావిస్తోంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. ప్రస్తుతం సిట్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ  కేసుల దర్యాప్తు కోణంలోనే ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధమైన అధికారాలు లేవు.
 
 కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అధికారం లేదు. కేసులు నమోదు చేయాలన్నా.. నిందితులను కస్టడీకి తీసుకోవాలన్నా.. సమన్లు జారీ చేయాలన్నా సంబంధిత పోలీస్‌స్టేషన్ ద్వారానే చేయాల్సి వస్తోంది. దీంతో కేసుల దర్యాప్తు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో చట్టబద్ధత కల్పిస్తే సిట్ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అలాగే న్యాయస్థానాల్లో కూడా ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా ఉంటాయి.

మరిన్ని వార్తలు