ఘరానా జకీర్ !

24 Dec, 2013 05:53 IST|Sakshi
ఘరానా జకీర్ !

=సుదర్శన్ అన్న పేరుతో బెదిరింపులు
 =రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 47 కేసుల్లో ఇతను నిందితుడు
 =సిటీలో 14 నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్
 =పీటీ వారెంట్‌పై తెచ్చేందుకు పోలీసుల సన్నాహాలు

 
 సాక్షి, సిటీబ్యూరో:  ‘హలో... నేను పీపుల్స్ వార్ గ్రూప్ జిల్లా కమాండర్ సుదర్శన్ అన్నని మాట్లాడుతున్నాను... నేను చెప్పినట్లు చేయకపోతే నీ కుటుంబాన్నే లేపేస్తా...’
 
నకిలీ నక్సలైట్ మహ్మద్ రఫీయుద్దీన్ అలియాస్ జకీర్ బెదిరింపుల నైజమిది. ఆదివారం రాజమండ్రి పోలీసులు అరెస్టు చేసింది ఈ ఘరానా నిందితుడినే. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలు సాగించే ఇతడిపై వివిధ జిల్లాల్లో 47 కేసులు నమోదయ్యాయి. గతంలో పలుమార్లు సిటీ పోలీసులకు చిక్కి బెయిల్‌పై విడుదలైన జకీర్ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో 14 నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో జకీర్‌తో పాటు అతడి భార్యనూ ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై సిటీకి తీసుకొచ్చేందుకు నగర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
 
భార్యతో కలిసే నేరాలు...
 
కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన జకీర్ నగరంలోని టోలిచౌకీలో నివాసముంటున్నాడు. భార్య జమీదున్నిస్సా బేగం అలియాస్ షకీలా సోహానీతో కలిసి 2001 నుంచీ నేరాలు చేస్తూ అనేకసార్లు జైలుకెళ్లి వచ్చాడు. ‘నకిలీ నక్సల్స్ పేరుతో వసూళ్లు’ అనే వార్తను పేపర్‌లో చదివి ఈ దందా ప్రారంభించానని జకీర్ గతంలో నగర పోలీసులకు చిక్కినప్పుడు చెప్పాడు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2008 జూన్‌లో జకీర్‌తో పాటు భార్యనూ అరెస్టు చేశారు.  బెయిల్‌పై అదే ఏడాది సెప్టెంబర్‌లో జైలు నుంచి బయటకు వచ్చారు.

బెయిల్ కోసం చేసిన ఖర్చులు వసూలు చేయడానికి మళ్లీ పాత దందానే ప్రారంభించారు. జకీర్ ఈసారి తన భార్యతోపాటు మరికొందరితో కలిసి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వందల మందికి బెదిరింపు ఫోన్లు చేశాడు. వీరిలో కొందరి నుంచి డబ్బు వసూలు చేశారు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2009 జనవరి 23న అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆదివారం రాజమండ్రి పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురిలో జకీర్‌తో పాటు అతడి భార్య షకీలా కూడా ఉంది.

ప్రతిసారీ ఓ కొత్త ముఠా...
 
2009లో అరెస్టైన జకీర్ 13 నెలల పాటు జైల్లో ఉండి 2010 మార్చిలో బయటకొచ్చాడు. పాత ముఠాను పక్కన పెట్టి కొత్తగా కరీంనగర్ జిల్లాకు చెందిన మహ్మద్ జఫర్ సో మహ్మద్ ఆజం, మహ్మద్ మాజిద్ అలీలతో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. బోగస్ ధ్రువీకరణ పత్రాలతో సిమ్‌కార్డులు కొనుగోలు చేసి సుదర్శన్ అన్న, రమేష్ అన్న, సంతోష్ అన్న పేర్లతో బెదిరింపు ఫోన్లు ప్రారంభించాడు. బాధితులను తీవ్రంగా బెదిరించడం ద్వారా డబ్బు, బంగారం డిమాండ్ చేశాడు. వాటిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకురమ్మని చెప్పి అనేక చోట్ల తిప్పుతాడు. చివరకు ఓ ప్రాంతంలోని రాళ్ల కింద లేదా మరో చోట ఆ డబ్బు పెట్టమని చెప్పి.. వాటిని తీసుకుంటాడు.  ఆర్‌ఎంపీ డాక్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, అధికారులు ఇలా అనేక మందిపై ఈ ట్రిక్కు ప్రయోగించాడు. తూర్పుగోదావరి జిల్లాలో వ్యవహారానికి తన భార్యతో పాటు అన్వర్ షరీఫ్‌ను వినియోగించాడు.
 
విలాసవంతమైన జీవితం...
 
బెదిరింపుల ద్వారా వసూలు చేసిన సొమ్మును జకీర్ విలాసాల కోసమే ఎక్కువగా ఖర్చు చేసేవాడు. ఖరీదైన హోటళ్లలో బస, భోజనాలతో పాటు అనేక విలాసాలు చేస్తారు. జకీర్ ధరించే దుస్తులు, బూట్లు, వినియోగించే సెల్‌ఫోన్ సైతం అత్యంత ఖరీదైనవే. షర్టు రూ. 3600, ప్యాంట్ రూ. 4200, బూట్లు దాదాపు రూ. ఆరు వేలు, సెల్‌ఫోన్ రూ. 20 వేలకుపైనే ఖరీదు చేసేవి వాడతాడు. కొన్నాళ్ల క్రితం తన కుమారుడి పుట్టినరోజును దుబాయ్‌లో నిర్వహించాడు. అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ తతంగానికి జకీర్ రూ. 9 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపెట్టాడు. సిటీలో నమోదైన కేసుల్లో జకీర్, అతడి భార్యపై ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేసేందుకు సిటీకి తేనున్నారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
 

మరిన్ని వార్తలు