డెంగీ పంజా

23 Sep, 2013 02:30 IST|Sakshi
డెంగీ పంజా

సాక్షి, సిటీబ్యూరో : నగరంపై డెంగీ మళ్లీ పంజా విసురుతోంది. సీజనల్ వ్యాధులతో ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. డెంగీ, మలేరియా, డిఫ్తీరియా వంటి వ్యాధులు చాపకింది నీరులా విస్తరిస్తున్నా సంబంధిత అధికారుల్లో ఏమాత్రం చలనం కలగడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 158 మలేరియా కేసులు, 55 డెంగీ కేసులు నమోదయ్యాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే సుమారు 200 డిఫ్తీరియా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు డిఫ్తీరియాతో మృత్యువాత పడగా, మరో ఐదుగురు డెంగీతో చనిపోయారు. సీజనల్ వ్యాధులతో సిటీజనులు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

 ఆస్పత్రుల్లో బాధితులు

 గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. కలుషిత నీటి వల్ల బస్తీలు పడకేశాయి. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. నగరంలోని ఏ ఇంట్లోకి తొంగి చూసినా జలుబు, తలనొప్పి, జ్వర పీడితులే దర్శనమిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, బాలింతలు పొద్దుపొడిచినా ముసుగు తీయడం లేదు. ఉప్పర్‌పల్లికి చెందిన మౌనిక(9) తీవ్రమైన డెంగీ జర్వంతో గాంధీ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. నాలుగు రోజుల కిందట ఆమెను ఆస్పత్రిలో చేర్చినట్లు మౌనిక తల్లిదండ్రులు తెలిపారు. అదేవిధంగా మేడిపల్లిలోని శ్రీనివాసనగర్‌కు చెందిన కె.శంకర్ డెంగీ జర్వంతో బాధపడుతుండగా బంధువులు ఆయనను రామంతాపూర్‌లోని ఏడీఆర్‌ఎం ఆస్పత్రికి తరలించారు. ఇంకా పలువురు బాధితులు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

ఊసేలేని యాక్షన్‌ప్లాన్..?

జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారికంగా 1470 పైగా మురికివాడలు ఉన్నాయి. సంపన్నులు నివసించే బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఫిలింనగర్‌లతో సామాన్యులుండే లంగర్‌హౌస్, మాణికేశ్వరినగర్, గుడిమల్కాపూర్, మూసారంబాగ్, గోల్నాక, భోలక్‌పూర్, చిలకలగూడ, వారసిగూడ, పార్శిగుట్ట, గాంధీనగర్, ఉప్పల్, తదితర బస్తీల్లో డెంగీ, మలేరియా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.

అయినా ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులు గాని, అటు వైద్యాధికారులు గాని రంగంలోకి దిగి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వ్యాధుల నివారణ కోసం జిల్లా వైద్యాధికారులు ముందస్తుగా ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సి ఉంది. ఆయా బస్తీల్లో పర్యటించి, వ్యాధులపై ముం దే ఓ అంచనాకు రావాల్సి ఉంది. కానీ వైద్యాధికారులు ఇప్పటివరకు అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఆరోగ్య కేంద్రాల్లో విలువైన మందులే కాదు దగ్గు, జలుబుతో బాధపడుతున్న చిన్నారులకు కనీసం సిరఫ్‌లు కూడా దొరకడం లేదు. వైద్యులు రాకపోవడంతో నర్సులు, హెల్త్ అసిస్టెంట్లు, ఆయాలే బాధితులకు పెద్దదిక్కు అవుతున్నారు.

 నిబంధనలు పట్టని ప్రైవేటు ఆస్పత్రులు

 నగరంలో ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల తో పాటు ఏడు ఏరియా ఆస్పత్రులు, 85 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల్లోనే డెంగీకి చికిత్స చేస్తున్నారు. డెంగీ, మలేరియాతో బాధపడుతున్న వారి నుంచి రక్తపు నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపాలి. కానీ పలు ప్రైవే టు, కార్పొరేట్ ఆస్పత్రులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. సాధారణ జర్వంతో బాధపడుతున్న వారికీ డెంగీని బూచీగా చూపుతున్నాయి. ప్లేట్‌లెట్స్ తగ్గాయని, వెంటనే వాటిని ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదమని రోగులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వైద్యం పేరుతో వారి నుంచి రూ.50 వేల నుంచి రూ. 70వేల వరకు గుంజుతూ దోపిడీకి పాల్పడుతున్నాయి.
 
 రక్తంలో ప్లేట్‌లెట్స్ ఎలా ఉండాలంటే....
 శరీరంలో ఉండాల్సిన ప్లేట్‌లెట్స్ : 1.50 లక్షల నుంచి 2 లక్షలు
 కనీసం 40 వేలకు పైగా ఉండాలి. వీరికి వెంటనే రక్తం ఎక్కించాలి,. లే దంటే మృతి చెందే ప్రమాదం ఉంది
 40 వేల కంటే తక్కువ ఉంటే కష్టమే
 
 ప్రభుత్వ ఉచిత వ్యాధి నిర్ధారణ కేంద్రాలు
 ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), నారాయణగూడ
     
 వెంటెరీనరీ బయలాజికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (వీబీఆర్‌ఐ), మెహిదీపట్నం
 
 లక్షణాలివీ..

 తీవ్రమైన జ్వరం
 భరించలేని ఒంటి నొప్పులు
 శరీరంపై దద్దుర్లు
 కళ్లు ఎరుపెక్కడం
 రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోవడం
 
 జాగ్రత్తలివీ...

 డెంగీ, మలేరియా దోమలు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఇంట్లోని నీటి ట్యాంకులను, కుండలను, క్యాన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంటి పరిసరాల్లో పాత టైర్లు, కొబ్బరి బొండాలు, చెత్త కుండీలు పెట్టకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు గదుల్లో గాలి వెలుతురు ఉండేలా చూడాలి. పిల్లలకు విధిగా పగటిపూట కూడా దోమతెరలు వాడాలి. ఇంట్లోకి దోమలు జొరబడకుండా కిటికీలకు సన్నటి జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లపై మూతలు ఉంచాలి. మూడు రోజులకు మించి నిల్వ ఉన్న మంచినీటిని తాగరాదు.
  - డాక్టర్ రంగనాథ్, అడిషనల్ సూపరింటిండెంట్, ఉస్మానియా
 
 యాక్షన్ ప్లాన్ అందలేదు

 మలేరియా, డెంగీ వ్యాధుల నివారణ కోసం జీహెచ్‌ఎంసీ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది. అది మాకింకా అందలేదు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు హైరిస్క్ జోన్లలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం. అయితే గత ఏడాదితో పోలిస్తే డెంగీ, మలేరియా కేసులు తక్కువే నమోదవుతున్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.     
- డాక్టర్ శ్రీహర్ష, జిల్లా మలేరియా నియంత్రణ అధికారి, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు