సిటీలో సూడో డాక్టర్

7 Mar, 2014 03:11 IST|Sakshi
సిటీలో సూడో డాక్టర్
  • వైద్యుడి ముసుగులో చోరీలు
  •    ఆస్పత్రిలోని రోగులే టార్గెట్
  •    మరో ‘అడుగు’ వేస్తే ప్రమాదమే
  •    దృష్టి కేంద్రీకరించిన పోలీసులు
  •  సాక్షి, సిటీబ్యూరో: సిటీలో సూడో డాక్టర్ సంచరిస్తున్నాడా..? ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను, వారి బంధువులను టార్గెట్‌గా చేసుకుని పంజా విసురుతున్నాడా..? అవుననే అంటున్నారు పోలీసులు. ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాల నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

    సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ఏడో అంతస్తులో ఉన్న ఫిమేల్ సర్జికల్ వార్డులో చికిత్స పొందుతున్న కవిత నుంచి రక్తనమూనాలు సేకరిస్తానంటూ ఓ యువకుడు ఏప్రాన్, స్టెత్‌స్కోప్‌లతో వచ్చాడు. ఆమె దృష్టి మళ్లించి మూడున్నర తులాల బంగారు గొలుసు తస్కరించాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆస్పత్రిలో తీవ్ర కలకలం సృష్టించింది. కేవలం ఇదొక్కటే కాదు, గడిచిన 14 నెలల కాలంలో నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో ఈ తరహా ఘటనలు ఐదు వెలుగు చూశాయి. బాధితుల్లో రోగులు, వారి బంధువులే కాదు వైద్యులూ ఉన్నారు.
     
    అన్నీ ఒకే తరహాలో జరగడంతో ఒకే వ్యక్తి లేదా ముఠా ఈ చోరీలకు పాల్పడతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా డాక్టర్ వేషంలో సిరెంజ్‌లు పట్టుకుని వస్తూ ఇంజెక్షన్ చేయాలని, నమూనాలు సేకరించాలని చెప్తున్న నేరగాళ్లు మరో ‘అడుగు’ ముందుకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

    సొత్తు కోసం ఏదో ఒక ఇంజెక్షన్ లేదా మత్తు ఇంజెక్షన్లు ఇస్తే అసలే చికిత్స పొందుతున్న రోగులు ప్రమాదపుటంచుకు వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు సూడో డాక్టర్‌కు చెక్ చెప్పడానికి ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఈ కేసులను నిశితంగా పరిశీలించి నిందితుల్ని పట్టకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వీలున్నంత వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు.
     
    ఊహాచిత్రం విడుదల...
     గాంధీ ఆసుపత్రిలో బుధవారం జరిగిన గొలుసు చోరీ కేసులో నిందితుడి ఊహాచిత్రాన్ని చిలకలగూడ పోలీసులు గురువారం విడుదల చేశారు. బాధితురాలు కవిత, ఆసుపత్రిలో ఆమె వద్ద సహాయకురాలిగా ఉన్న వారు తెలిపిన వివరాల ప్రకారం దొంగ ఊహాచిత్రాన్ని రూపొందించామని డీఐ ఖాజామొయినుద్దీన్ తెలిపారు.
     

మరిన్ని వార్తలు