సిటీ జామ్

10 Oct, 2013 05:27 IST|Sakshi
సిటీ జామ్

=     వర్ష బీభత్సం.. ట్రాఫిక్ అస్తవ్యస్తం
=     ఈ సీజన్‌లో ఇదే రికార్డు
=    9.81 సెంటీమీటర్లుగా నమోదు
=     రాదారులన్నీ గోదారులు
=     గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్
 

సాక్షి, సిటీబ్యూరో: ఒకపక్క మెట్రోరైలు పనులు.. మరోపక్క ఇప్పటికే దెబ్బతిన్న రహదారులు.. అసలే నత్తనడకన సాగుతున్న ట్రాఫిక్ బుధవారం కురిసిన భారీ వర్షంతో పడకేసింది. ఒక్క వానకే రాకపోకలు కకావికలమయ్యాయి. రోడ్ల నిండా నీళ్లు.. కదలని వాహనాలు.. చుక్కల్ని చూపించాయి. వర్షం కురిసి.. వెలిసిన చాలాసేపటి వరకు కూడా వాహనాల వేగం గంటకు ఐదు కిలోమీటర్లు మించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటరు ప్రయాణానికి అరగంట పట్టింది. గంటల తరబడి వాహనాలు ముందుకు కదల్లేదు. రాత్రి 11 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.
 
 మామూలుగానే మహా ఘోరం..
 
సాధారణ రోజుల్లోనే ఉదయం, సాయంత్రం వేళల్లో నగరంలో ట్రాఫిక్ జామ్స్ మామూలే. అదే సమయంలో వర్షం కురిస్తే.. బుధవారం అంతా ఇళ్లకు వెళ్లే వేళ కురిసిన వర్షం నరకాన్ని చూపించింది. నగర వ్యాప్తంగా దాదాపు 67 ప్రాంతాల్లో వర్షమొస్తే నీళ్లు నిలిచిపోతున్నాయి. ఆయా రహదారులన్నీ గోదారులవుతున్నాయి. ఇది నగరంలో ఎప్పుడూ ఉండే పరిస్థితే అయినా.. ఇప్పటికే రోడ్లు దెబ్బతిని ఉండటంతో బుధవారం మరింత దారుణంగా మారింది. ఫలితంగా వాహనాల వేగం పడిపోయింది. పలుచోట్ల బారులు తీరి నిలిచిపోయాయి. కొందరు వర్షం నుంచి తలదాచుకునేందుకు ద్విచక్రవాహనాలను రోడ్ల పక్కన ఆపి అటుఇటు పరుగులు తీయడంతో వెనుకే వస్తున్న వాహనాలు ఆగిపోయాయి.
 
 ‘మెట్రో’ మార్గంలో అవస్థలు


 నగరంలో మెట్రోరైల్ నిర్మాణ పనులు జరుగుతున్న రహదారులపై ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. నాగోలు-మెట్టుగూడ, సికింద్రాబాద్-బేగంపేట, ఎల్బీనగర్-చాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్-నాంపల్లి, పంజగుట్ట-కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఎక్కడిక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ఈ రూట్లలో ప్రయాణం నరకాన్ని చూపించింది.
 
 చెట్టు, హోర్డింగులు కూలడంతో...


 బుధవారం కురిసిన వర్షానికి నగరంలోని పలుచోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్, కేబుల్ తీగలు తెగిపడ్డాయి. కటౌట్లు, హోర్డింగ్స్ కుప్పకూలాయి. రోడ్లన్నీ జామ్ కావడంతో వీటి తొలగింపులో జాప్యం జరిగింది. జోరువానలో పరిస్థితిని చక్కదిద్దలేక ట్రాఫిక్ పోలీసులు చేతులెత్తేశారు. వర్షం తగ్గి, వీరు రంగంలోకి దిగేసరికి పరిస్థితి చేయిదాటిపోయింది. వాహనచోదకులే ఆగుతూ.. సాగుతూ ఎలాగో ‘దారి’ వెతుక్కున్నారు.
 
 బళ్లూ, ఒళ్లూ హూనం


 వర్షం, ఛిద్రమైన రోడ్లు, ఆగిపోయిన ట్రాఫిక్ కారణంగా వాహనాల మైలేజ్ ఘోరంగా పడిపోయింది. కార్లు వంటి వాహనాలు కేవలం ఒకటి, రెండు గేర్లలో మాత్రమే కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తుండటంతో ఇంధనం ఎక్కువ ఖర్చయింది. మరోపక్క వర్షాలకు ఛిద్రమైన రోడ్ల కారణంగా వాహనాలు దెబ్బతిన్నాయి. శరీరాలూ హూనమయ్యాయి. గోతులు గుర్తించలేక పలువురు అదుపుతప్పి పడిపోయారు.
 
 ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులు..


 ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్, బేగంపేట , ముషీరాబాద్, అమీర్‌పేట, అబిడ్స్, కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నల్లకుంట, ఎంజే మార్కెట్, జీపీఓ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్‌ట్యాంక్, టోలిచౌకి, రవీంద్రభారతి, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, తార్నాక.
 

మరిన్ని వార్తలు